Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-బయ్యారం
జీఓ నెంబర్ 67 ద్వారా మండలంలోని ధర్మాపూర్ గ్రామంలోని 35 వేల 171 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడం దారుణమని అఖిలపక్ష నాయకులు అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం నిరసన, ధర్నా చేశారు. అనంతరం మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకుడు మండ రాజన్న మాట్లాడారు. జిల్లా అభివద్ధికి పారిశ్రామికంగా బయ్యారంలోని ఐరన్ ఓర్ లక్షల ఎకరాల్లో ఉందని రాష్ట్ర విభజన సందర్భంలో బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్మాణానికి అనుకూల మైన ధర్మపురంలోని 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ శాఖకు బదిలీ చేయడం వల్ల జిల్లా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పోడు భూములు సాగు చేసు కుంటున్న వారికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు నాయిని శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ భూమి రెవిన్యూ పరంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజాఅవసరాల కోసం ఆ భూములను సద్వినియోగం చేయాలని, అటవీ శాఖకు అప్పగించడం సరికాదని తెలిపారు. అటవీ శాఖకు అప్పగించిన భూమిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు జగ్గన్న మాట్లాడుతూ అధికారులు చేష్టలుడిగినట్టు ధ్వజమెత్తారు. ధర్మపురంలోని 35 వేల ఎకరాలను అటవీ శాఖకు అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు, ప్రభుత్వ భూములపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా నిరుద్యోగాన్ని పెంచడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెండాగా మారిందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం తీసుకోకపోవడంతో తహసీల్దార్ కుర్చీ ఎదుట మెమోరాండం ఉంచి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.