Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీటీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి
నవతెలంగాణ-కాజీపేట
కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజులను చెల్లించని తల్లిదండ్రులు వారి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తుంటే మరోవైపు రేషనలైజేషన్ నేపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేలా ఉత్తర్వులు జారీ చేయడం విచారకరమని బీసీటీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి అన్నారు. కాజీపేట దర్గాలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్లు పొందారని తెలిపారు. ప్రధానంగా సర్కారు బడుల్లో అందుబాటులోకి వచ్చిన ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో ఈ అడ్మిషన్లు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతతో బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేట్ లో చదివించలేని స్థితిలో తల్లిదండ్రులు తమ తమ పిల్లల చదువుల కోసం అప్పులపాలు కావాల్సి వస్తుందన్నారు. కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందు సేకరించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుని రేషనలైజేషన్ ఉత్తర్వులు జారీ చేయడమేమిటి అని ప్రశ్నించారు. సర్కారు బడుల మూసివేతతో డ్రాపౌట్స్ పెరుగుతాయని, బాల్యవివాహాల వంటి అనర్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల తో కమిటీలు వేయడ,ం ఇతర రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయిస్తూనే రేషనలైజేషన్ చేపట్టడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలను కల్పించాల్సిన ప్రభుత్వం బడులను మూసివేస్తూ నిరుద్యోగుల ఆశలను గండికొడుతుందని ఆందోళనవ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య బలోపేతం కావాలంటే ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, సింగిల్ టీచర్‌తో బడుల నిర్వహణ కష్టసాధ్యమనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కోరారు. అటు నిరుద్యోగులఇటు బడుగు, బలహీనవర్గాల పిల్లల చదువు కోసం రేషనలైజేషన్ ఉత్తర్వులను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.