Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మైనింగ్ వద్దు పర్యావరణం ముద్దు అని సర్పంచ్ కవితాకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునూర్ గ్రామంలో కార్యదర్శి జాన్‌పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. గ్రామంలోని ఇనుపరాతి గుట్టలను మైనింగ్‌కు అప్పజెప్పే ప్రయత్నాలు మానుకోవాలని పాలకవర్గం ఏకగ్రీవం తీర్మానం చేసిందన్నారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ యువత ప్రజలు పార్టీలకతీతంగా మైనింగ్‌కు పర్మిషన్ ఇవ్వకుండా ఏకం కావాలన్నారు. మైనింగ్‌తో ఇనుపరాతి గుట్టల్లోని ఖనిజ సంపదను కొల్లగొడుతూ జంతు పక్షి ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్జీవోలు పిట్టల రవిబాబు, విశ్రాంత డీఎఫ్ఓ కాజీపేట పురుషోత్తం మాట్లాడుతూ.. ఇనుప రాతి గుట్టలను ప్రభుత్వం పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని కోరారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాటి కలెక్టర్ ఆమ్రపాలి తదితరులు ట్రెక్కింగ్ చేసి పరిశీలించారని గుర్తు చేశారు. గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి ఆర్టికల్ 51 ఎజీ ప్రకారం పోరాడాలన్నారు. పర్యావరణ సమతుల్యానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ వేల చెట్లు, జంతుజాలం కాకతీయ కట్టడాలు ఉన్న ఇనుప రాతి గుట్టలను తొలగించడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ఇనుప రాతి గుట్టల పరిరక్షణకు మైనింగ్ పర్మిషన్ ఇవ్వొద్దని సంతకాల సేకరణ చేయించి గ్రామస్తులతో పర్యావరణ పరిరక్షణకు సర్పంచ్, పాలకవర్గం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చింత మధు, ఎంపీటీసీ లక్క సునీత శ్రీనివాస్, వార్డు సభ్యులు నర్మద, రమేష్, రాజేందర్, కవిత, కమలాకర్, ఎన్జీవోలు శ్యాంసుందర్, కే.సందీప్ పాల్గొన్నారు.