Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు వెంటనే పోడుభూములకు సంబంధించి పట్టాలివ్వాలని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని హితవు పలికారు. మండలంలోని లింగాలలో షర్మిల బుధవారం పోడుదీక్ష నిర్వ హించి మాట్లాడారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను సైతం అమలు చేయని దుస్థితి నెలకొందన్నారు. పోడురైతులకు పట్టాలివ్వకపోగా హరితహారం పేరుతో అటవీ, పోలీసు అధికారులను ఉసిగొల్పి దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదార్లపై దాడులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో నాటి సీఎం వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి పోడురైతులకు పట్టాలివ్వగా టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులను, అటవీ శాఖ అధికారులను ఉసిగొల్లి దాడులు చేయిస్తూ లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన స్ఫూర్తితో ఆదివాసీలకు, బడుగులకు అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. అనంతరం తుడుందెబ్బ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. పోడు సమస్య పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. తొలుత గిరిజన సంప్రదాయం ప్రకారం షర్మిలకు ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. పరిసర గ్రామాల ఆదివాసీ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే తమ గోడు వెళ్లబోసుకున్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, పార్లమెంటరీ కన్వీనర్ సుజాత మంగీలాల్, పార్లమెంటరీ కమిటీ కో కన్వీనర్ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, స్టేట్ కన్వీనర్ బజారు శ్యాంప్రసాద్, మండల అధ్యక్షుడు బాగే నర్సింహులు, నాయకులు దేవానాయక్, తదితరులు పాల్గొన్నారు.