Authorization
Fri March 21, 2025 06:51:03 am
నవతెలంగాణ
జనరల్ మేనేజర్ సుబ్బారావు
నవతెలంగాణ-హన్మకొండ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నవ తెలంగాణ పత్రిక జనరల్ మేనేజర్ సుబ్బారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో సోమ నరసయ్య అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి మూలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారీతిగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన తర్వాత మూడు రైతు వ్యతిరేక చట్టాలతో పాటు ఎల్ఐసి లాంటి బీమా సంస్థలను ప్రయివేటుకు అప్పజెప్పేందుకు ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. సుదీర్ఘకాలంగా రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం రైతులు పోరాడుతుంటే ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించటం గర్హనీయమన్నారు. బడా పెట్టుబడిదారుల కోసమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.
నిరంతరం ప్రజల కోసం పనిచేయాలి
: జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అవగాహన కలిగి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి అన్నారు. మహాసభ అనంతరం తెలంగాణ శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బండారి బాబు రెండోసారి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నవతెలంగాణ మేనేజర్ దేవేందర్ రావు, స్టాప్ రిపోర్టర్ దయాసాగర్, సర్కులేషన్ ఇన్చార్జి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బంగారు బాబు మాట్లాడుతూ... తన ఎన్నికకు సహకరించిన నవతెలంగాణ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో శాఖ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.