Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ- హన్మకొండ
ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, విద్యారంగ సమస్యలను, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని, పాలక వర్గాల తీరుపై విద్యార్థి, యువత, నిరుద్యోగులు పోరాటాలు చేయాల్సిన సమయం అసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ ములుగు రోడ్ లోని ఎంసీసీ కాన్ఫరెన్స్ హల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఐత యాకయ్య అధ్యక్షతన విద్యార్థి, నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో మోడీ, ఇంటికో ఉద్యోగమని రాష్ట్రంలో కేసీఆర్‌లు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి నేడు హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అమ్ముతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను, రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలు చేస్తున్నాడని అన్నారు. సమస్యలపై పాలక వర్గాల మెడలు వంచే పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం-2000 పేరుతో విద్య కాషాయీకరణకు, ప్రయివేటీకరణకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన టీిఆర్‌ఎస్ ఏడు సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాల ఖాళీలన్నింటిని భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యన్ అశోక్ స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సి నివేదిక ప్రకారం లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 50 వేలు ఖాళీలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి అటు ఉద్యోగాలు రాకా, ఇటు ఏ పని దొరక్కా విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కావాల్సింది నిరుద్యోగ భృతి కాదని, ఉద్యోగాలని అన్నారు. ఉద్యోగాల కోసం రాష్ట్రంలో 42మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3,785 పాఠశాలలను మూసివేస్తున్నారని, ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకోచ్చారని అన్నారు. తద్వారా ప్రభుత్వ విద్య పేదలకు అందకుండా పోతుందన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరిం చాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ చేసే పోరాటంలో నిరుద్యోగులంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ యన్ శంకర్, సీపీఐ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కార్యదర్శులు మేకల రవి, పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, సీపీఐ జిల్లా నాయకులు తోట బిక్షపతి, గన్నారపు రమేష్, బుస్సా రవీందర్, ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కె నరేష్, సోతుకు ప్రవీణ్ పాల్గొన్నారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించివ్వాలి
జిల్లాలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించివ్వాలని, ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు నిర్మించివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీహన్మంతుకు సీపీఐ నాయకుల బృందం చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ... కాజీపేట, ధర్మసాగర్, వేలేరు, హసన్ పర్తి, బీమదేవర పల్లి తదితర మండలాలలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పేదలకు ఇండ్ల స్థలాలు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని అన్నారు. వేలేరు మండలంలోని పీచర,కన్నారం, షోడశ పల్లి, కాజీపేట మండలం మడికొండలో, హసన్ పర్తి మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, దళితులకు మూడెకరాల పథకం ద్వారా పంపిణీ చేయాలని కోరారు.