Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను ఉదతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జే.వెంకటేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి సీపీఐ(ఎం) పార్టీ మండల నాలుగవ మహాసభ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభ ప్రారంభం సూచికగా పార్టీ నాయకులు కంపేటి. రాజయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ధరలు విపరీ తంగా పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తుందన్నారు. ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేయొద్దని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. మండలంలో ఉన్న అర్హులైన కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్, పెన్షన్, రేషన్ కార్డులు ఇవ్వాలని మండలంలోని అన్ని గ్రామాలలో అంతర్గత రోడ్లు, సైడు కాలువలు నిర్మించాలని మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వాలని ఉపాధి హామీ పనిని 200 రోజులు రోజుకు 600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంపూర్ నుండి నాగారం వరకు అలాగే దూదేకుల పల్లి నుండి పందిపంపులకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. ఓపెన్ కాస్ట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. భూపాలపల్లి కేంద్రంలో రిజిస్ట్రేషన్ ,లేబర్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరిని సమీకరించి పోరాటాలు ఉదతం చేసి పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బందు సాయిలు, నాయకులు వెలిశేట్టి, రాజయ్య, సి హచ్ రమేష్ ,దామెర కిరణ్, పొలం రాజేందర్, గుర్రం దేవేందర్, ఎండి రజాక్, లక్ష్మణ్, రవి, బాబు, నారాయణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.