Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
నవతెలంగాణ-నర్సింహులపేట
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. పలువురు అధికారుల తీరుపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయం, ఆర్డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యా, రెవెన్యూ, తదితర శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయించడంతోపాటు శానిటైజ్ చేయించాలని సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు చెప్పారు. తాగునీటి, ఇతర వసతులు కల్పించాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిదులు మంజూరు చేస్తోందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్ధవంతంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సంగీత, వైస్ ఎంపీపీ దేవేందర్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ ఇమ్మానియేల్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు మెరుగు శంకర్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.