Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పులి చిన్న నర్సయ్య గౌడ్
నవతెలంగాణ-తాడ్వాయి
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల లో గీత కార్మిలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి చిన్న నర్సయ్య గౌడ్ విమర్శించారు. మండలంలోని కాటాపూర్ గ్రామం లోని తాటి వనంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో సంఘం గడ్డం శ్రీధర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశా నికి ముఖ్యఅతిథిగా నర్సయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రస్తుతం 50 ఏండ్లకుపైబడ్డ గీత కార్మికులకు పింఛన్లు ఇస్తుండగా, మిగతా అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు ఈసేవ/మీసేవ కేంద్రాలకు వెళ్తే నిర్వాహకులు గీత కార్మికుల దరఖాస్తులను తీసుకోవడం లేదన్నారు. గీత కార్మికులకు 57 ఏండ్లు ఉంటేనే వెబ్సైట్ యాక్సెప్ట్ చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 50 ఏండ్లు ఉన్న గీత కార్మికులందరికీ జీఓ నెంబర్ 36ను వర్తింపజేయాలని, పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు తమ్మల్ల సమ్మయ్య గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు పాలకుర్తి రవీందర్‌గౌడ్, నాయకులు గడ్డం రాములు, వడ్లకొండ నర్సయ్య, తడక సాయికుమార్, గండు సదయ్య, గడ్డం శ్రీధర్, బెల్లంకొండ నరేష్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.