Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని పందిపంపుల గ్రామానికి చెందిన రైతులు మల్లెల రాములు, ఊకె పుల్లయ్యలకు చెందిన పంటల్లో అటవీ శాఖ అధికారులు అర్ధరాత్రి సమయంలో గడ్డిమందు కొట్టడం దుర్మార్గమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ ఎస్డీఎల్సీ మండల కార్యదర్శి మదార్, జిల్లా నాయకురాలు ఊకె పద్మ మండిపడ్డారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయినట్టు తెలిపారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. అనేక ఏండ్లుగా సాగు చేసుకొంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీల పొట్టకొట్టడం, తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అటవీ శాఖలను ఉసిగొల్పి ఆదివాసీ గిరిజనులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. గడ్డి మందు కొట్టిన అటవీ శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనీ, బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సాగుభూములకు సంబంధించి అర్హులందరికీ వెంటనే పట్టాలిచ్చి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు గుజ్జు దేవేందర్, పొమ్మయ్య, మాదంశెట్టి నాగేశ్వర్రావు, తుడుం వీరభద్రం, సర్పంచ్ చింత సుభద్ర, ఉపసర్పంచ్ గంగులు, శేషు, సనప రాంబాబు, బచ్చలి బుచ్చిరాములు, శివయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.