Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
సెప్టెంబర్ చివరిలోగా జిల్లాకు నిర్దేశించిన రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈ సంవత్సరం వానకాలం, వేసంగిలో రూ.874.54 కోట్ల పంట రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.124.37 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 21.11 కోట్ల రుణాలు ఎంఎస్ఎంఈ, రూ.2.60 కోట్ల విద్యా రుణాలు, రూ.9.99 కోట్ల హౌసింగ్ రుణాలు, రూ.129.16 కోట్ల ప్రాధాన్యత రంగా రుణాలు, రూ.9.20 కోట్ల ఇతర ప్రాధాన్యత రంగాల రుణాలు, రూ.62.14 నాన్ ప్రయార్టీ సెక్టార్ రుణాలను మంజూరు చేశామని తెలిపారు. బ్యాంకర్లు, సంబంధిత సంక్షేమ శాఖల అధికారుల సహకారంతో జిల్లాలో పేద ప్రజల స్వయం ఉపాధికి వివిధ రుణాలను మంజూరు చేస్తున్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఆర్థిక స్వావలంబన పథకాలు జిల్లాలోని అర్హులైన నిరుపేదలందరికీ అందించడమే లక్ష్యంగా బ్యాంకర్లు విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో గిరిజన నిరుపేద ప్రజలు అధికంగా ఉన్నందున వారికి ఆయా సంక్షేమ శాఖల ద్వారా అందించే స్వయం ఉపాధి రుణాల గురించి తెలిసేలా రుణ మేళాలు నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఏటూరునాగారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ పొందిన గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో రుణ మేళ నిర్వహించి ట్రైకార్, పిఎంఈజిపి, జిల్లా పరిశ్రమల కేంద్రం తదితర రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. నీటి వనరులలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆలస్యమైనందుకు వెంటనే చేపపిల్లలను వదులుటకు చర్యలు చేపట్టాలని గిరిజనులకు కూడా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ అధికారి భాస్కర్‌ను ఆదేశిం చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో కూరగా యలను పండించేందుకు కూరగాయల పందిళ్లను పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన 54 మంది లబ్ధిదారులకు త్వరగా కూరగాయల పందిళ్లను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలను అందించేందుకు ఎంపిక చేసిన లబ్ధిదారులతో నేడు భూపాలపల్లి, కాటారంలో వేరువేరుగా ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి శ్రీనివాస్‌ను ఆదేశించారు. పంట రుణాలు మంజూరులో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా బ్యాంకులకు నిర్ణయించిన లక్ష్యాల మేరకు త్వరగా పంట రుణాలను అందించాలని, సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి రుణాల రికవరీ సమర్థవంతంగా చేయా లని బ్యాంకర్లను ఆదేశించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గెం వెంకటరాణి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు మంజూరు అవ్వడానికి ఏడాది దాటుతోందని త్వరగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యా, హౌసింగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ఉపాధి తదితర రుణాల గురించి సాధారణ ప్రజలకు తెలిసేలా విరివిగా బ్యాంక్ మేళాలు నిర్వహించాలని కోరారు. భూపాలపల్లి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ కార్యక్రమం ద్వారా రుణాలను సకాలంలో మంజూరు చేసిన బ్యాంకర్లను, సహకరించిన ఎల్డిఎం ను మెప్మా ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. బదిలీపై ఆదిలాబాద్ జిల్లాకు వెళుతున్న జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను సన్మానించారు. జేసీ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎల్డిఎం శ్రీనివాస్, డిఆర్డిఓ పురుషోత్తం, ఎస్సి కార్పొరేషన్ ఇడి వెంకటేశ్వర్లు, జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజరు భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఎర్రయ్య, జిల్లా పరిశ్రమలకేంద్రం అధికారి శ్రీనివాస్, మెప్మా డిపిఎం రాజేశ్వరి, బ్యాంకర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు .