Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలను తెరవనున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటేషన్ చేయించాలని సూచించారు. అలాగే శిధిలావస్థలో ఉన్న పాఠశాలలకు మరమ్మతులు చేయించాలని చెప్పారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే పేద విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ పాఠశాలలను బలపేతం చేస్తామని హామీ ఇచ్చి తదనంతరం మాట మార్చడం ప్రభుత్వ మోసపూరిత విధానానికి అద్దం పడుతోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, బడ్జెట్ బడులను ఆదుకోవాలని కోరారు. విద్యారంగం పట్ల మోసపూరిత విధానాలను వీడకపోతే భవిష్యత్లో ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధు, కేలోత్ సాయికుమార్ మాట్లాడారు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందే తాగునీటి, మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్మిస్తామన్నారు. పాఠశాలల్లో స్వీపర్లను, స్కావెంటజర్లను నియమించడంతోపాట అర్హులందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసేసే విధానాన్ని మానుకోవాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శి ప్రసాద్, మానుకోట డివిజన్ కార్యదర్శి సూర్య ప్రకాష్, తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.