Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని
నియమించాలి : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
రైతులకు అవగాహన కార్యక్రమాలు
నిర్వహించాలి : ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్లో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు, రైతుల కోసం రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఉద్యాన పంటలు ఫిషరీస్, పాడిపరిశ్రమలో ప్రోత్సాహం, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి జిల్లాలోని విద్యాసంస్థలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, ఆయా కార్యక్రమాలను సంబంధిత అధికారులు సమర్థవంతంగా నిర్వహిం చాలని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేయకుండా విద్యాశాఖ అధికా రులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్వరగా విద్యుత్ కనెక్షన్స్ అందించాలని, వర్షాలతో పడిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలన్నారు. వైద్యఆరోగ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంది పేద ప్రజలకు వైద్య సేవలందించాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలని అన్నారు. ఆయా శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ముందస్తుగా అందజేసి జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు కావాలని సూచించారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలన్నారు. మిషన్ భగీరథ మంథని సెగ్మెంట్లో ఉన్న జిల్లాలోని మల్హర్రావు, కాటారం, మహాదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాలను అధికారుల పర్యవేక్షణకు భూపాలపల్లి సెగ్మెంట్లో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి నివేది కలు పంపించాలని అధికారులను ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో లేనందున రెండు మండలాలకు ఒక విద్యాశాఖ అధికారిని నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికా రిని ఆదేశించారు. దళితబంధు పథకంను ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో ఉపాధ్యాయులు లేకుండా ఏ పాఠశాల ఉండరాదని అవసరమైతే పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయు లను డిప్యుటేషన్ మీద పంపించాలన్నారు. వారం పది రోజుల్లోగా మరొకసారి సదరం క్యాంపు నిర్వహించాలని అన్నారు. పెరిగిన జనాభాకనుగు ణంగా మిషన్ భగీరథ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలనానరు. ఆస్పిరేషనల్ డిస్టిక్ కార్యక్రమం ద్వారా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హెల్త్ సబ్ సెంటర్కు ప్రత్యేక భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రుణమాఫీ వివరా లను రైతులకు అందించాలని, మందుల దుకా ణాలలో ఎరువులు, రసాయనాల స్టాక్ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పండించేందుకు ముందుకు వచ్చిన రైతులతో ఆయిల్ ఫామ్ పండించే జిల్లాలలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రైతుబీమా పథకంపై రైతులకు పూర్తి స్థాయిలో మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. మానేరు నదికి సంబంధించి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సంయుక్తంగా సర్వే చేసి రెండు జిల్లాలు లబ్ధి పొందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉద్యానవన మల్చింగ్ యూనిట్లను అధికంగా ఇవ్వాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్స్ నిర్మాణాలకు మండలాలలో భూములను గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పంచాయతీలు చురుగ్గా పాల్గొనాలన్నారు. ఇంటింటికి శుద్ధమైన మిషన్ భగీరథ తాగునీరందించాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్వరగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులు అధిక మొత్తంలో హాజరయ్యేలా అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పాత ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఎంపీపీలు, జడ్పిటీసీలు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
అంతకుముందు ఎంపీపీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ... ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆయిల్ పామ్ సాగుచేస్తున్న ప్రాంతానికి రైతులను తీసుకెళ్లి చూపించాలన్నారు. వర్షాలతో నష్టపోయిన పంటలను త్వరగా లెక్కించి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న మహదేవపూర్, కాటారం,పలిమేల మండలంలోని భూములను పరిశీలించి నష్టపరిహామివ్వాలని కోరారు. కాటారం మండలం పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నందున రైతులకు మేలు రకం పండ్ల తోటలను పెంచేందుకు శిక్షణ ఇప్పించాలన్నారు. తాడిచర్లలోని ఏఎంఆర్ బొగ్గు బ్లాక్ వలన పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారని వారికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు తాడిచెర్ల పీహెచ్సీలో ఏఎంఆర్ కంపెనీ ద్వారా వైద్యుల్ని నియమించాలన్నారు. మానేరు నదికి సంబంధించిన పూర్తి బెనిఫిట్స్ పెద్దపల్లి జిల్లాకు పోతున్నాయని, ఈ రెండు జిల్లాల అధికారులతో సర్వే చేయించి జిల్లా వాటాను జిల్లాకు వచ్చేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను అందుబాటులో ఉంచి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు. గ్రామాల్లో గుడుంబాను నియంత్రించాలన్నారు. అన్ని మండలాల్లో సదరం క్యాంపులు నిర్వహించి అర్హులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, ఇప్పటికే సదరం క్యాంప్ లకు హాజరై వివిధ కారణాలతో సర్టిఫికెట్ పొందని అర్హత ఉన్న వికలాంగులకు పింఛన్ వచ్చేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. కాటారం పరిసరాల ఐదు మండలాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయం మంథనిలో ఉందని, దీంతో 15 మండలాల్లో మిషన్ భగీరథ సరఫరాకు అధికారుల పర్యవేక్షణ కొరవడుతుందన్నారు. అయిదు మండలాలను భూపాలపల్లి డివిజన్ లో కలపాలని కోరారు. వెలిశాల పీహెచ్సీ పరిసరాల్లోని కొన్ని గ్రామాలు దూరంగా ఉన్న ఒడితేల పరిధిలో ఉన్నాయని, వైద్య సేవలు పొందడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆయా గ్రామాలను వెలిశాల పీహెచ్సీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేటు విద్య సంస్థలలో పాత ఫీజులను వసూలు చేయకుండా చూడాలని కోరారు.