Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంగరను పర్యాటక ప్రాంతంగా
అభివృద్ధి చేస్తాం
మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-భీమదేవరపల్లి
ఆర్థిక సంస్కరణలతో దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేథావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొని యాడారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వగ్రామం వంగరలో పీవీ స్మతివనం విజ్ఞాన వేదిక పార్కుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ ఆయనకున్న 800 ఎకరాలను పేదలకు పంచి నాడు భూసంస్కరణలకు ఆద్యం పోశాడన్నారు. గతబ ప్రభుత్వాలు పీవీ గొప్పతనాన్ని చెప్పకుండా వివక్ష చూపారని అన్నారు. వచ్చే సంవత్సరానికి నాలుగున్నర ఎకరాల్లో పీవీ స్మృతివనం అత్యంత పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. రామప్పను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధంగా పీవీ గ్రామాన్ని ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... పీవీ వ్యక్తిగతంగా సేవ చేయకుండా సమాజానికి సేవ చేశారని తెలిపారు. మహిళలు అభివృద్ధికి స్వశక్తి సంఘాల ద్వారా ప్రతి మహిళకు మూడు లక్షల రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రూ.11కోట్లతో వంగర గ్రామం లో మ్యూజియం పార్క్, విజ్ఞాన వేదిక లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంగర గ్రామం నుండి చుట్టూ గ్రామాలకు వెళ్లేందుకు త్వరలోనే పూర్తిస్థాయి రోడ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేశవరావు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, హనుమకొండ జెడ్పీ చైర్మెన్ డాక్టర్ సుధీర్‌కుమార్, పర్యాటకశాఖ చైర్మెన్ శ్రీనివాస్ గుప్తా పర్యాటక శాఖ ఎండీ మనోహర్, డైరెక్టర్ హరికృష్ణ సర్పంచ్ రజిత, ఎంపీటీసీ కౌసల్య, ఎంపీపీ అనిత జెడ్పీటీసీ, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.