Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ఆహారభద్రత కార్డుదారులకు మూడు నెలల పాటు రేషన్ డీలర్లు సరఫరా చేశారు. ఇందుకు ప్రత్యేక కమీషన్ అందజేస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల హమాలీ ఖర్చులు, గది అద్దె, కరెంటు బిల్లులు కట్టడానికి సైతం అవస్థలు పడాల్సి వస్తుందని రేషన్ డీలర్లు బాహాటంగానే పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమీషన్ కాకుండా వేతనాలు అందజేస్తామని పేర్కొన్నప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 30 రేషన్ షాపులు ఉండగా అందులో పనిచేస్తున్న రేషన్ డీలర్లకు మూడు నెలలుగా కమిషన్ చెల్లించలేదు. దీనికి తోడు ఆధార్ కార్డు లింక్ చేయడంతో బయోమెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అంద జేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలిముద్రలు సమస్యలు తలెత్తడం, ఇంటర్నెట్ సమస్య వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐరిస్ పరికరాలు సరిగా పనిచేయని పరిస్తితి నెలకొంది. వీటన్నింటిని అధిగమించి రేషన్ పంపిణీ చేస్తున్నా కమిషన్ చెల్లించకపోవడం గమనార్హం.
బియ్యం బస్తాల్లో కోతలు
పౌరసరఫరాల శాఖ నుండి రేషన్ షాపులకు అందజేస్తున్న 50 కిలోల బియ్యం బస్తాలు మూడు నుంచి ఐదు కిలోల వరకు తూకం తక్కువగా వస్తుందని వాపోతున్నారు. అధికారులు వీటిని పట్టించుకోకుండా స్టాక్ లో తేడాలు వస్తున్నాయంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు రేషన్డీలర్లు పేర్కొంటున్నారు. తూకం తక్కువ భారం కూడా తమపైనే పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గోడౌన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బియ్యం తూకంలో తక్కువ రాకుండా చర్యలు తీసుకోవాలని, కమిషన్ సకాలంలో అందజేయాలని కోరుతున్నారు.