Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహాముత్తారం
మండల పరిధి పెగడపల్లి, ప్రేమ్‌నగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 108లో అక్రమంగా చేసుకున్న పట్టాలు రద్దు చేయాలని, కాస్తులో ఉన్న వారి భూమిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, సాగులో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పొలం రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామంలో రైతులతో కలిసి ఆయన సమావేశమై మాట్లాడారు. సర్వే నెంబర్ 180లో 1509 ఎకరాల భూమి ఉన్నదని, 3వేల ఎకరాలు పెంచి కాస్తులో లేనివారికి రెవెన్యూ అధికారులు పట్టాలు చేసి, కాస్తులో ఉన్నవారి పట్టాలు తొలగించారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 20 నుండి 30 ఎకరాల భూమి పట్టాలు చేశారని అన్నారు. సాగులో ఉన్న స్థానిక గిరిజన రైతులకు గుంట భూమి కూడా లేకుండా చేశారని అన్నారు. సుమారు 130 మంది భూమిని ఆన్లైన్లో తొలగించారన్నారు. దీంతో ప్రభుత్వ పథకాలు రైతుబంధు, బీమా, క్రాప్ లోన్లు వారికి వర్తించకుండా పోయాయన్నారు. 2010నుండి 2019 వరకు 80మంది బ్యాంకు లో లోను తీసుకున్నారని, వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు న్యాయం జరిగేలా సర్వే నిర్వహించి గిరిజన రైతులకు పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కతేర్ల వెంకట స్వామి, కోడి లక్ష్మీనారాయణ, సమ్మయ్య,. లక్ష్మక్క, మల్లక్క, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.