Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. మండలంలో ఆమె శుక్రవారం పర్యటించారు. ముప్పనపల్లి గ్రామంలోని జెడ్పీ సెకండరీ స్కూల్‌ను, గుర్రేవుల గ్రామంలోని జెడ్పీ, ఇతర స్కూళ్లతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీతక్క తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. చాలా కాలం తర్వాత సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన తాగునీటి, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలకు సరిపడా సిబ్బందిని నియమించాలని డీఈఓకు ఫోన్లో స్పష్టం చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, తరగతి గదులతోపాటు మరుగుదొడ్లను, పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. పీహెచ్సీలో వైద్యుల, సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న క్రమంలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ
మండలానికి చెందిన సుమారు 10 మంది జర్నలిస్టులకు హైదరాబాద్‌కు చెందిన సమారిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్చంధ సంస్థ సహకారంతో ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీతక్క తుపాకులగుడెం గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ కరంచంద్ గాంధీ, వైస్ ఎంపీపీ బుల్లెట్ భాస్కర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమన్న, ఏటురునాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు మహ్మద్ అఫ్సర్ పాషా, జాడి రాంబాబు, నాయకులు అబ్బు రమేష్, తాటి రాజబాబు, బోటి నగేష్, షేక్ యాకూబ్ పాషా, భిక్షపతి, గడ్డ నగేష్, కటకం మల్లయ్య, చిట్యాల శైలజ, అరుణ్, చింత నర్సక్క, చంద్రయ్య, మాదాసి రాజేందర్, సునారికాని రాంబాబు, జంగా కష్ణ, డేగల బాలయ్య, మరికల వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.