Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో గట్టి పట్టున్న, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న సీనియర్ నాయ కుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను మానుకోటలో శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. ఆయన రాజీనామా జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్ నేతల గుండెలు గుబెల్లుమంటున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో, ఆయనతో పాటు ఇంకా ఎంతమంది పార్టీకి దూరం అవుతారో అన్న చర్చ జోరందుకుంది. టీఆర్ఎస్కు తిరుగు లేదనుకున్న క్రమంలో శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా రాజకీయ దుమారానికి తెరలేపింది. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఓ పక్క సంక్షేమ పథకాల ప్రకటనలు, మరోపక్క టీఆర్ఎస్లో సంస్థాగత పటిష్టతకు సెప్టెంబర్ 2 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో టీఆర్ఎస్కు గట్టి పునాది వేయడంలో, పార్టీని గ్రామస్థాయిలో పటిష్టపర్చడంలో శ్రీకాంత్‌రెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదన్నది అందరికీ తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పని చేస్తున్నారు. నియోజకవర్గంలో రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందటంలో కీలకపాత్ర పోషించారు. ఎంపీ గెలుపులోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేశారు. చిన్న జిల్లాలకు సీఎం కేసీఆర్ అధ్యక్షులను నియమించలేదు. ఒకవేళ నియమించాల్సి వస్తే అందులో మొదటి స్థానంలో శ్రీకాంత్‌రెడ్డి ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో శ్రీకాంత్‌రెడ్డి కొన్ని రోజులుగా పార్టీకి దూరమయ్యారు. కార్యకర్తలకు మాత్రం వెన్నంటే ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఆయనకు సర్పంచ్ టికెట్ ఇవ్వడానికి కూడా నాయకత్వం అడ్డుపడిందన్న అపవాదు ఉంది. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి కూడా తటపటాయించినట్లు ప్రచారం జరిగింది. ఉద్యమ సమయం నుంచి పార్టీ ప్రతిష్ట కోసం పని చేశానని శ్రీకాంత్ లేఖలో పేర్కొన్నారు. నాయకత్వం లేని రోజుల్లోనూ ప్రజల్లో ఉద్యమ కాంక్ష రగిలించినట్టు తెలిపారు. జిల్లా ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. కాగా గడచిన ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో తనకు నిరాశా నిస్పహలే మిగిలాయని వాపోయారు. కార్యకర్తల్లోనూ నైరాశ్యం ఆవహించిందని ఆందోళన వెలిబుచ్చారు. కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కడం లేదని స్పష్టం చేశారు. నాయకత్వం కార్యకర్తలను వాడుకుని వదిలేస్తున్నట్టు కనపడుతున్నా పార్టీ ఆదేశాలను పాటించినట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ వేదనలోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్ధేశించిన దానికి జిల్లాలో క్షేత్రస్థాయిలో అమలౌతున్న దానికి పొంతన కుదరడం లేదని తేటతెల్లం చేశారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. రాజకీయ అవసరాలు, పదవుల కోసం కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా పార్టీలో ఉండలేనని ప్రకటించారు. జిల్లా ప్రజల, కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకొని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో టీఆర్ఎస్లో దూకుడు తగ్గిందనే ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా జిల్లాలో కాంగ్రెస్‌లో ఉలుకూ పలుకూ లేదు. వెన్నం వెంట భారీ సంఖ్యలో శ్రేణులు కాంగ్రెస్‌లో వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది.