Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
టీఆర్ఎస్ ఆవిర్భావించినప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థాగత ఎన్నికలు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు జరగింది కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే. నాటి నుంచి ప్రకటనలే తప్ప ఆచరణలో పార్టీ నిర్మాణం జరిగిందే లేదు. రాష్ట్రస్థాయిలో పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల పదవులు మాత్రమే వున్నాయి. గత కొన్నేండ్లుగా టిఆర్ఎస్ పార్టీ నిర్మాణం పరిస్థితి ఇంతే. జిల్లాలకు కమిటీలు వేయడమే మరిచిపోయారు. రాష్ట్రం లో విపక్షాలు బలహీనంగా ఉన్న క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి నాయకత్వం పట్టించుకోలేదు. తొలినాళ్లలో ఏటా పార్టీ ప్లీనరీ జరగాల్సి ఉండగా రెండేళ్లకోమారు జరపడం ప్రారంభించారు. కొంగరకలాన్‌లో జరిగిన ప్లీనరీకి ముందు, తరువాత పార్టీ నిర్మాణంపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మంత్రి కేటీఆర్‌ను నియమించిన అనంతరం కూడా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. తాజాగా రాష్ట్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించడమే కాకుండా భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో మంత్రి కేటీఆర్ మళ్లీ సంస్థాగత ఎన్నికల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ప్రకటనలు మామూలే.. తరువాత మరిచిపోవడం కూడా మామూలేనని టీఆర్ఎస్ శ్రేణులే వ్యాఖ్యానించడం కొసమెరుపు.
రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి పెరుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 2ప జెండా పండుగ నిర్వహించి గ్రామ, వార్డు కమిటీలను నియమించనున్నట్లు ప్రకటించడం అటు టీఆర్ఎస్లో ఇటు బయట చర్చకు దారితీసింది. సంస్థాగత నిర్మాణం కోసం కార్యచరణ రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు సంస్థాగత నిర్మాణం జరిగింది కేవలం ఒకేసారి. నాటి నుండి నేటి వరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై చేసిన ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్పా ఆచరణకు నోచుకోలేదు. టిఆర్ఎస్ పార్టీకి గత కొన్నేండ్లుగా ఏ జిల్లాలోనూ జిల్లా, మండల స్థాయి కమిటీలు లేవు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి పార్టీలో పని చేస్తున్న నేతలకు కనీసం పార్టీ పదవులు కూడా దక్కని దుస్థితి టీఆర్ఎస్లో నెలకొంది. నామినేటెడ్ పదవులు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకే దక్కుతుండడంతో ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో జిల్లా కమిటీలు వద్దని రద్దు చేశారు. నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉంటాయని ప్రకటించారు. నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని ప్రచారం చేసినా, అంతటితోనే ఆపేశారు. నేటికీ ఎమ్మెల్యేలు కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయే తప్పా ప్రత్యేక పార్టీ నిర్మాణం లేకపోవడం గమనార్హం.
నామినేటెడ్ పదవుల పందెరం నేపథ్యం..
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవులు హుజురాబాద్ నియో జకవర్గానికి చెందిన నేతలకే ఇస్తుండడం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి నేపథ్యంలోనే కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గ్రామస్థాయి నుండి జిల్లా కమిటీ లను నియమిస్తామని ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని కొంత చల్లార్చడానికే ప్రకటన చేశారేమోనన్న వ్యాఖ్యలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి.
బలోపేతమవుతున్న విపక్షాలు
విపక్షాలు బలోపేతమవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్కు బిజెపి ప్రత్యా మ్నాయంగా ఎదుగుతుండడం, మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్పై ముప్పేట దాడి చేస్తు న్నారు. ఈ క్రమంలో వారి విమర్శలను తిప్పికొట్టడానికి పార్టీ యంత్రాంగం అవసరమైంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలను నడిపిం చారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే భారీ కార్యక్రమా లను నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్కు మేమే ప్రత్యా మ్నాయమని చెప్పడమే కాకుండా నిరూపించడానికి తహతహలాడుతుంది. దీంతో పార్టీ నిర్మాణం చేయకపోతే విమర్శల దాడిలో చతికిలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు. ఇదిలావుంటే ఈ ప్రకటన కూడా అమలవుతుందా ? లేదా ? అనే విషయంలో టిఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు సైతం వుండడం గమనార్హం.
సెప్టెంబర్ 2 నుంచి...
సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ జెండా పండుగను నిర్వహించి వార్డు, గ్రామ కమిటీలను 12వ తేదీ వరకు నియమించనున్నట్లు ప్రకటించారు. 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలను నియమించి అనంతరం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుందని, సెప్టెంబర్ 20వ తేదీ తరువాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం సంస్థాగత నిర్మాణంపై ప్రకటనలు చేసి మరిచినట్టు, కేటీఆర్ కూడా మరిచిపోతారేమోనన్న అభిప్రాయాలు గులాబీ శ్రేణుల్లో ఉన్నాయి.