Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
సీఎం కేసీఆర్ దూరదృష్టితో భావి తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారని వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని ప్రగతి సింగారం గ్రామ స్మశానవాటిక ప్రాంగణంలో పోలిస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడో విడత హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. స్వరాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటడంతో పచ్చని ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోందన్నారు. సర్పంచ్లకు నిధులు, విధులు అందజేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడంతో కరోనా విపత్కర పరిస్థితులను తట్టుకోగలిగామని అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయన్నారు. రైతు బంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర, కల్యాణ లక్ష్మి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుం టుందన్నారు. త్వరలో భూపాలపల్లి నియోజకవర్గ పరిధి దళితులందరికీ దళిత బంధు అమలు అవుతుందన్నారు. శాయంపేట మండలానికి 455 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా ప్రగతి సింగారం గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఇటీవల కాంట్రాక్టర్ తో మాట్లాడమని, వర్షాకాలం పూర్తికాగానే ఇండ్ల నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. మందారీపేట నుండి ప్రగతి సింగారం వరకు, అక్కడి నుండి కటాక్షపుర్ వరకు డబల్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, పరకాల రూరల్ సిఐ తొగిటి రమేష్ కుమార్, ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్, ప్రొబేషనరీ ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.