Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలోని పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డి చెప్పారు. జెడ్పీ కార్యాలయంలోని చాంబర్లో చైర్మెన్ అధ్యక్షతన శనివారం 1-7 స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. విద్య, విద్యుత్, జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ, పౌరసరఫరాలు, భూగర్భజల శాఖ, పరిశ్రమలు, ఉపాధికల్పన, గ్రామీణ త్రాగునీరు, పంచాయితీరాజ్, సహకారం, వైద్యం, క్రీడలు, చేనేత జౌళీ, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ సంపత్‌రెడ్డి మాట్లాడారు. విద్యాసంస్థల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు జెడ్పీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులు వినియోగించాలని సూచించారు. సెప్టెంబర్ 1న విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లలందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల విద్యాధికారులు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో తనిఖీలు చేసి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంపై విస్తత ప్రచారం కల్పించి జిల్లా నుంచి ఎక్కువ మంది లబ్ది పొందేలా చూడాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రైతులు నష్టపోకుండా పౌర సరఫరాల అధికారులు బాధ్యత తీసుకోవాలని, అర్హులకు చేనేత పథకాలు అందేలా అవగాహన కల్పించాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాద్వారా సురక్షిత త్రాగునీటితో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వంచే చేపడుతున్న రైతు వేదికలు, వైకుంఠదామాలు తదితర అన్ని అభివృద్ధి పనులకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు, వాటిని వినియోగిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా చేయాలని, ప్రతిరోజు చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తరలించాలని చెప్పారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, కోవిడ్ నియంత్రణపై అవగాహన తోపాటు జాగ్రత్తలపై గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాలను అభివద్ధి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, జిల్లా స్టాండింగ్ కమిటి చైర్మెన్ మారపాక రవి, జెడ్పీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు బొల్లం మణికంఠ, జెడ్పీటీసీలు దీపికరెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, శ్రీనివాస్, ఇల్లందుల బేబి, ముద్దసాని పద్మ, తదితరులు పాల్గొన్నారు.