Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
పాఠశాలలన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని, మండల అధికారులదరు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు అందుతాయని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ ఎం లావణ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు ఏడాది కాలం తర్వాత పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున ఉపాధ్యాయులు, అధికారులు సెలవులు తీసుకోకుండా విధుల్లో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, కరోనా పట్ల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదతరవి ఏర్పాట్లు చేయాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని వసతులు, పిల్లల పరిస్థితిని పరిశీలించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు గుర్తించి, వాటిని పాఠశాలల కోసం వినియోగించుకోవాలన్నారు. పతి పాఠశాలను ఏఎన్ఎం సందర్శించి, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజనానికి నిత్యావసర వస్తువులు సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు పత్తి, మిర్చి, మొక్కజొన్న లాంటివే కాకుండా ప్రత్యామ్నాయ పంట ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగును రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని, వైద్య శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పీహెచ్సీ డాక్టర్ రవికుమార్‌ను ఆదేశించారు. సర్పంచ్, ఎంపీటీసీ పాఠశాలల సదుపాయాలపై పర్యవేక్షించాలన్నారు. మత్స్య సంపదపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌ను ఆదేశించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని సీడపీఓ ఆవంతిని ఆదేశించారు. హార్టికల్చర్, సెరికల్చర్ శాఖల ద్వారా చేపట్టే తోటల పెంపకం కూరగాయల సాగు, వివిధ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని కోరారు. ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే మండల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. జెడ్పి వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, వైస్ ఎంపీపీ సముద్రాల దీపా రాణి శ్రీనివాస్ ఎంపీడీవో అనిల్ కుమార్, భూపాలపల్లి తాసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులను జెడ్పీ సీఈఓ పరిశీలన
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలల్లో కొనసాగుతున్న శానిటేషన్ పనులను జెడ్పీ సీఈఓ శోభారాణి శనివారం పరిశీలించారు. విద్యాసంస్థల పునర్ ప్రారంభం నేపథ్యంలో పంచాయతీల పరిధి విద్యాసంస్థలను శుభ్రం చేస్తున్నామని జడ్పీ సీఈఓ అన్నారు. పాఠశాలలు,కళాశాలల్లోని తరగది గదులను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తున్నామన్నారు. నీటి వసతికి ఇబ్బందులు లేకుండా భగీరథ నీరు నిరంతరం అందేలా పైపులైన్లు వేయాలని, కళాశాల లోని మినరల్ వాటర్ ప్లాంట్ ను వాడుకలోకి తెచ్చేలా చూడాలని ఎంపీపీ రాణిబాయి అన్నారు. జెడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీడీఓ శంకర్,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, అధ్యాపకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి : జెడ్పీ సీఈఓ
నవతెలంగాణ-గణపురం
పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని జెడ్పీ సీఈఓ శోభారాణి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మైలారం పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో పాఠశాలలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాలలకు కావలసిన నిధులు గ్రామపంచాయతీ నుండి వాడుకోవాలని కోరారు సర్పంచ్‌లతో మాట్లాడమని పాఠశాల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయాలని వారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కరెంటు, మంచినీరు మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించాలన్నారు. అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి, ఎంపీడీవో అరుంధతి మండలంలోని గణపురం చేల్పుర్, కర్కపల్లి పాఠశాలలను పరిశీలించారు.
సకల వసతులు ఏర్పాటు చేయాలి : ఎంపీపీ మల్హర్రావు
నవతెలంగాణ-మల్హర్రావు
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠాశాలు, ఎడ్లపల్లి మోడల్, మాల్లారం కస్తూర్బా ఆశ్రమ పాఠశాల, తాడిచెర్ల వసతి గృహాల్లో అధికారులు ముమ్మరంగా శానిటేషన్ పనులు చేపట్టి, విద్యార్థులకు సకల వసతులు ఏర్పాటు చేయాలని ఎంపిపి మల్హర్ రావు సూచించారు. శనివారం ఎంపీడీఓ నరసింహమూర్తి తో కలిసి తాడిచెర్ల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు. పాఠశాలల్లో శానిటేషన్, మంచినీటి సమస్య, కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు విద్యార్థులకు ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రతి పాఠశాల శుభ్రంగా ఉండాలి : డీఎల్పీఓ
నవతెలంగాణ-మహాముత్తారం
ప్రతి పాఠశాల శుభ్రంగా ఉండాలని డీఎల్పీఓ సుధీర్ కుమార్ అన్నారు. శనివారం మహా ముత్తారం జిల్లా పరిషత్ హై స్కూల్, వజినేపల్లి, స్తంభంపల్లి (పిపి), ములుగుపల్లి, పోలరం, మదరం, జీలపల్లి, గ్రామాలలోని పాఠశాలనలు ఆయన తనిఖీ చేశారు. ఈనెల 30 వరకు అన్ని పనులు పూర్తిచేసి సుందరంగా తీర్చి దిద్దాలని కోరారు. ఎంపీడీఓ రవీందర్ నాథ్, ఎంపీఓ ఆర్ ఉపేంద్రయ్య పాల్గొన్నారు.
పరిశుభ్రత పనులు పూర్తి చేయాలి : పురుషోత్తం
నవతెలంగాణ-టేకుమట్ల
మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో చేస్తున్న పరిశుభ్రత పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం అన్నారు. శనివారం మండలంలోని గర్మిల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపు, గదుల పరిశుభ్రత, త్రాగునీరు సౌకర్యం, విద్యుత్ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల విద్యాధికారి కొడపాక రఘుపతి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం అబివృద్ధి గురించి రాజి లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి వారం విద్యార్థుల ఆరోగ్యం గురించి, పాఠశాల పరిశుభ్రత గురించి, ప్రత్యేక పర్యవేక్షణ చేస్తామన్నారు. రోజు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు శానిటైజర్ చేసి మాస్క్ లు పెట్టుకునేలా చూడాలన్నారు. ఎవరికైనా విద్యార్థులకు కరొన లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తరగతి గదులలో సామాజిక దూరం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన జరిపించాలని సూచించారు. ఎంపీపీ రెడ్డి మల్లరెడ్డి, ఎంపీడీవో చండీరాణి,సర్పంచులు పోలాల సరోత్తంరెడ్డి, నల్లబెల్లి రమా రవీందర్, ఉపాధ్యాయులు తోట మహేందర్, శంకరయ్య, బుచ్చి రాములు, నాగరాజు పాల్గొన్నారు.
పాఠశాలలు సిద్ధం చేయాలి : సుదర్శన్ రాథోడ్
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రత్యేక్ష తరగతులకు ప్రభుత్వ పాఠాశాలలు సిద్ధం చేయాలని మండల స్పెషల్ అధికారి సుదర్శన్ రాథోడ్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని కొయ్యుర్, వల్లేంకుంట, కొందంపేట, తాడిచెర్ల, మాల్లారం,ఎడ్లపల్లి గ్రామాల్లో ఆయన ఎంపీడీఓ నరసింహమూర్తి తో కలిసి జిల్లా పరిషత్, ప్రాథమిక, ఎడ్లపల్లిలోని ఆదర్శ పాఠశాలలను సందర్శించారు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో తరగతి గదులు, వంట గదులను, మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితో పరిసరాల్లో సోడియం, హైపోక్లోరైడ్ పిచికారీ చేయించాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి సర్వం సిద్దం చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రసాద్, నరేశ్, సత్యనారాయణ, కుమార స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.