Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. టీఆర్ఎస్లోనే నాలుగు వర్గాలున్నాయి. ఎమ్మెల్యే పంతం నెగ్గించుకోవడానికి శ్రమించాల్సి వస్తోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం నుంచి మేయర్‌ను ఎంపిక చేయించాలనుకొని చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు ప్రచారంలో ఉంది. మంత్రి ఎర్రబెల్లి చక్రం తిప్పడంతో రింగ్ రివర్స్ అయ్యింది. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిని దిడ్డి కుమారస్వామికి ఇప్పించాలనుకొని భంగపడ్డారు. అనంతరం 'గ్రేటర్' ఎన్నికల్లో 'దిడ్డి'ని కార్పొరేటర్‌గా గెలిపించి డిప్యూటీ మేయర్ చేయాలనుకున్నా అధిష్టానం ససెమిరా అంది. దీంతో ఎట్టకేలకు ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఆశించిన 'దిడ్డి'కి నిరాశే మిగిలగా ఆయన సతీమణికి ఇప్పించుకోగలిగారు. ఇదిలా ఉంటే వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న 'దిడ్డి' తాజా ఎన్నికల్లో తన ప్యానెల్‌ను గెలిపించుకోగలిగారు. తూర్పు రాజకీయాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, 'దిడ్డి'కి ఒకటేనన్న భావన ఉంది. ఈ క్రమంలో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతుదారుడైన దిడ్డి కుమారస్వామి ఓటమి పాలవడం తాజా పరిణామం. 'ఛాంబర్' ఎన్నికల్లో ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మినహా డైరెక్టర్లంతా 'బొమ్మినేని' ప్యానల్‌కు మద్దతివ్వడం కొసమెరుపు.
వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో సయోధ్య కుదరని పలువురు నేతలు నియోజకవర్గ కేంద్రంగా ఉండడం ఎమ్మెల్యేకు మింగుడుపడని విషయం. తాజాగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతుదారుడైన దిడ్డి కుమారస్వామి ప్యానల్లోని ఎవరూ గెలుపొందకపోవడం గమనార్హం. 'దిడ్డి'ని వ్యతిరేకిస్తూ ప్యానల్‌తో రంగంలోకి దిగిన బొమ్మినేని రవీందర్‌రెడ్డి తన ప్యానల్‌ను పూర్తిస్థాయిలో గెలిపించుకోగలిగారు. భారీ మెజార్టీతో 'బొమ్మినేని' విజయం సాధించడం ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో దశాబ్ధాలుగా 'దిడ్డి' నాయకత్వంలోనే కార్యకలాపాలు నడిచాయి. ఆయన ఛాంబర్‌ను అంతగా ప్రభావితం చేశారన్నది అక్షర సత్యం.
తగ్గుతున్న పరపతి
వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో గట్టి పట్టున్న దిడ్డి కుమారస్వామి గతంలో ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఆశించి భంగపడ్డారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మద్దతుదారుడిగా ఆయనపై ముద్రపడడమే అందుకు కారణం. చైర్మెన్‌గా 'దిడ్డి' పేరును ప్రకటించడమే తరువాయి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన్ను పక్కనపెట్టి పరకాల నియోజకవర్గానికి చెందిన చింతా సదానందం తెరపైకి వచ్చారు. 'చింతా'కు రెండోసారి కూడా పదవీకాలాన్ని పెంచడంతో 'దిడ్డి' ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలొచ్చాయి. ఎమ్మెల్యే నరేందర్‌కు ఇబ్బందికరంగా మారిన బీజేపీ నేత గంటా రవికుమార్‌ను ఓడించడానికి ఆయన పోటీ చేస్తున్న డివిజన్లో 'దిడ్డి'ని రంగంలోకి దింపారు. 'గంటా' నామినేషన్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించడంతో 'దిడ్డి' గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. కానీ 'దిడ్డి' చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా స్వల్ప మెజార్టీతో గెలిచారు. గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో గెలవడం కూడా 'దిడ్డి' పరపతిని మరింత దిగజార్చింది. డిప్యూటీ మేయర్ పదవిని 'దిడ్డి'కి ఇప్పించడానికి ఎమ్మెల్యే నరేందర్ తీవ్రంగా కృషి చేసినా సాధ్య పడలేదు.
ఎనుమాముల మార్కెట్లో గందరగోళం
ఎనుమాముల మార్కెట్ భౌతికంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నా ఛైర్మన్, పాలకవర్గంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఆధిపత్యం గతం నుంచి ఉంది. గతంలో కాంగ్రెస్ పాలనలో నాటి మంత్రి బస్వరాజ్ సారయ్యకు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి సారయ్యకు నడుమ ఎనుమాముల మార్కెట్ పాలకవర్గం నియామకంలో తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఆశించిన దిడ్డి కుమారస్వామికి అది దక్కకపోవడం, 'గ్రేటర్' ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికవడంతో మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో దిడ్డి కుమారస్వామి తన సతీమణి భాగ్యలక్ష్మీకి చైర్మెన్ పదవి ఇప్పించుకున్నారు. మార్కెట్‌పై అవగాహన లేని భాగ్యలక్ష్మికి చైర్పర్సన్ పదవి ఇవ్వడం పట్ల టీఆర్ఎస్ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. 'దిడ్డి' సతీమణిని చైర్పర్సన్ చేయడంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. ఎనుమాముల మార్కెట్ పాలకవర్గంలో చైర్పర్సన్ మినహా మిగతా డైరెక్టర్లందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో బొమ్మినేని రవీందర్‌రెడ్డి ప్యానల్‌కు మద్దతు పలకడం గమనార్హం. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, 'దిడ్డి'లపై ఉన్న వ్యతిరేకతతో 'బొమ్మినేని'కి మద్దతు పెరిగి భారీ మెజార్టీతో ఆ ప్యానల్ విజయం సాధించింది. ఈ ఎన్నికలు అటు మార్కెట్లో ఇటు వ్యాపార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సమన్వయం కరువు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస ్వరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వద్దిరాజు రవి చంద్ర కీలక నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌ను నరేందర్‌తోపాటు బస్వరాజ్ సారయ్య, ప్రదీప్‌రావు, గుండు సుధారాణి ఆశించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం నరేందర్‌కు టికెట్ ఇవ్వగా ప్రదీప్‌రావు రెబల్‌గా రంగంలోకి దిగి భారీ ర్యాలీని నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు ఎన్నికల బరి నుంచి ప్రదీప్‌రావు తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అనంతరం వద్దిరాజు టీఆర్ఎస్లో చేరి మంత్రి దయాకర్‌రావుకు సన్నిహితుడిగా మారి ఆయన పర్యటనల్లో కీలకంగా మారడంతో 'తూర్పు' ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేగింది. ఈ కీలక నేతల నడుమ 'నన్నపునేని' మనుగడ సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పక తప్పదు. ఈ నేతలతో 'నన్నపునేని'కి సయోధ్య కుదరకపోవడం గమనార్హం. 'ఛాంబర్' ఎన్నికల్లో భారీ పరాజయం ఈ లోపాన్ని ఎత్తిచూపింది. ఏది ఏమైనా 'తూర్పు'లో ఈ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్‌గా మారాయి.