Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మంత్రుల ఆదేశం ఎంపీలు, 5గురు ఎమ్మెల్యేల గైర్హాజర్
'ముత్తిరెడ్డి' అసంతృప్తి
నవతెలంగాణ-వరంగల్
దేవాదుల ప్రాజెక్టు పరిధి పెండింగ్ పనుల పూర్తి నివేదిక రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు, నీటిపారుదలశాఖ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేయాలన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గత పాలకులు దేవాదుల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. 5.18 టీఎంసీల సామర్ధ్యంతో 1.22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించగా, నాటి పాలకులు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో దేవాదుల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటి ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. ప్రాజెక్టును మరింత అభివృద్ధి పరిచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6.25 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు 60 టీఎంసీల గోదావరి జలాలలను వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుండి 9 నెలలపాటు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి తుపాకులగూడెం వద్ద సమ్మక్క-సారలమ్మ బ్యారేజీని నిర్మించామన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ వద్ద నీటిమట్టం నిలువ కేవలం 8 టీిఎంసీల సామర్ధ్యం వుందన్నారు. కరువు వచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 10 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ప్యాకేజీ 6లోని ఉప్పుగల్లు, పాలకుర్తి, చెన్నూర్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నర్సంపేట, పరకాల, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల తోపాటు అన్ని నియోజకవర్గాల్లో దేవాదుల కాలువల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో అవసర మైన చోట చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు.
'ముత్తిరెడ్డి' అసంతృప్తి
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నియోజకవర్గంలో చెరువులను నింపడానికి చేయాల్సిన పనులను వివరిస్తుండగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అడ్డుపడడంతో 'ముత్తిరెడ్డి' తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. నియోజక వర్గ సమస్యలు మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు సమావేశంలో ఉండడమెందుకంటూ వెళ్లిపోవడం చర్చనీ యాంశంగా మారింది.
ఎంపీ, ఎమ్మెల్సీలు, 5గురు ఎమ్మెల్యేల గైర్హాజర్
ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టుతోపాటు నీటిపారుదల శాఖ పనులపై కీలక సమావేశానికి వరంగల్ ఎంపీ దయాకర్‌తోపాటు 5గురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వరంగల్ లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, ఎమ్మె ల్సీలు బస్వరాజ్ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేష్, డీఎస్ రెడ్యా నాయక్, శంకర్‌నాయక్, దాస్యం వినరుభాస్కర్, నన్నపునేని నరేందర్‌లు హాజరు కాలేదు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం ప్రారంభంలోనే వెళ్లిపోయారు.
సీఎం కేసీఆర్ దృష్టికి లింగంపల్లి రిజర్వాయర్ పనులు
దేవాదుల ప్రాజెక్టు నీటిని నిల్వ చేయడానికి ప్రతిపాదించిన లింగంపల్లి రిజర్వాయర్ పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టు, నీటిపారుదల శాఖ పనుల సమీక్ష అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చొరవతో దేవాదుల ప్రాజెక్టు ఎత్తిపోతల సామర్ధ్యాన్ని 60 టిఎంసిలకు పెంచారన్నారు. గతంలో మూడు, నాలుగు నెలలే ఎత్తిపోసే ఈ ప్రాజెక్టును 9 నెలలపాటు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రాజెక్టును తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరందించను న్నామన్నారు. దేవాదుల ప్రాజెక్టు మొదటి దశలో 45వ ప్యాకేజీ కింద 96 శాతం, 46వ ప్యాకేజీ కింద 91 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. నక్కలతూము కింద 1,700 ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆర్ఎస్ ఘన్పూర్ పనులు 97 శాతం పూర్తయ్యాయన్నారు. జనగామ జిల్లాకు సంబంధించిన నీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయా లన్నారు. పెండింగ్ పులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. వేలేరు ఎత్తైన ప్రదేశంలో వుందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన ఆరవ ప్యాకేజీ పనులు కూడా ఖచ్చితంగా ప్రారంభించాలన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చెక్ డ్యామ్‌లు, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలన్నారు..సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇఎన్సి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు సీతక్క, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ టి. రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ అర్భన్, జనగామ జడ్పీ ఛైర్మన్లు డాక్టర్ మారపల్లి సుధీర్‌కుమార్, సంపత్‌రెడ్డి, హన్మకొండ, ములుగు, వరంగల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, కృష్ణ ఆదిత్య, ఎం. హరిత, నీటిపారుదల శాఖ వరంగల్ సిఇ కె. వీరయ్య, ములుగు సిఇ బి. విజయభాస్కర్‌రావు, ఎస్ఇలు సుధాకర్‌రెడ్డి, యశస్వి తదితరులు పాల్గొన్నారు.