Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శెట్టి వెంకన్న అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను లీజు పేరుతో బడా పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టడం మొదలుపెట్టిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, తదితర నిత్యావసరాల ధరలనూ భారీగా పెంచిందని మండిపడ్డారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఏర్పడిందన్నారు. రైతు, కార్మిక, చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోసపూరిత చట్టాలను అమలు చేసే పనిలో నిమగమైందని ధ్వజమెత్తారు. తప్పుడు విధానాలపై కేంద్రంలోని బీజేపీని కట్టడి చేయడాన్ని విస్మరించి ప్రజలపై భారాలు మోపుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, భూపంపిణీ, పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 57 ఏండ్లకు పింఛన్, తదితర హామీలన్నీ మోసపూరితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక రావడంతో దళితుల ఓట్ల కోసం దళితబంధు పేరుతో రూ.10 లక్షలు, ఉద్యోగాలు, తదితర వాగ్ధానాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమౌతూ పాలకుల తప్పుడు విధానాలపై అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి సమస్యల పరిష్కార దిశగా ఐక్యపోరాటాలు నిర్మించాలని దిశా నిర్ధేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సూర్నపు సోమయ్య, కార్యవర్గ సభ్యులు సమ్మెట రాజమౌళి, అల్వాల వీరయ్య, గునిగంటి రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, హోల్టైమర్లు పాల్గొన్నారు.