Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
సింగరేణిలో పేరుకుపోయిన అనేక కార్మిక సమస్యలపై సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ నేతత్వంలో దశలవారీ ఆందోళనలకు రూపకల్పన చేసినట్లు ఆ సంఘం భూపాల పల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య తెలిపారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ చాప కింద నీరులా జరుగుతూ ఉంటే గెలిచిన కార్మిక సంఘాలు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఏరియాలోని ఓసి గనులను యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ఉంటే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయుసిలు అడ్డుపడకుండా చోద్యం చూస్తున్నాయన్నారు. కార్మికుల పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. యాజమాన్యం రక్షణతో కూడిన ఉత్పత్తి కి సహకరించాలని అన్నారు. కనీసం మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన రక్షణ సమావేశాలు జరగడంలేదని, అధికారులు 15 రోజులకు ఒకసారి కూడా గనులలో దిగడం లేదని, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన మాటలు వింటూ ఉత్పత్తి, రక్షణ పై ధ్యాస లేకుండా ఉన్నారని విమర్శించారు. యాజమాన్యం ఇష్టారాజ్యంగా కార్మిక వ్యతిరేక సర్క్యులర్లు విడుదల చేసుకుంటూ పోతుంటే గెలిచిన సంఘాలకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయ మన్నారు. ఈనెల 23న శ్రీరాంపూర్ ఏరియా లో జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో అనేక కార్మిక సమస్యలపై కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 3న అన్ని గనులు ,డిపార్ట్మెంట్లలో మెమోరాండం ఇవ్వడం, 8న 11 ఏరియాల్లో జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం, సమస్యలు పరిష్కారం కాకుంటే వందలాది మంది కార్యకర్తలతో సిఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు పసునూటి రాజేందర్, రఘుపతి రెడ్డి, సదయ్య, శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, అశోక్ ,రాములు, లక్ష్మీనారాయణ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.