Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి అహల్య
నవతెలంగాణ-జఫర్ఘడ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న మహిళా, ప్రజావ్యతిరేక విధానాలపై మహిళలు ఉద్యమించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి అహల్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో చినూరి రాజవ్వ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సంఘం శాఖ మహాసభకు అహల్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో 1936లో సంఘాన్ని స్థాపించినట్టు తెలిపారు. నాటి నుంచి మహిళల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకుని ముందుకు సాగుతున్నప్పటికీ మహిళలపై అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉందని ఉదహరించారు. స్త్రీ, పురుష నిష్పత్తి భారీగా పడిపోయిందని తెలిపారు. మద్యం షాపులకు విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడంతో మహిళలపై హింస, నేరాలు పెరగడంతోపాటు కుటుంబాల జీవన ప్రమాణ స్థాయి పడిపోతున్నట్టు తెలిపారు. అయినా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సరికొత్త రూపాల్లో ముందుకొస్తున్న సవాళ్లను స్వీకరించి రెట్టింపు శక్తితో బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత సంఘం మీదే ఉందన్నారు. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు సూర్యాపేటలో తలపెట్టిన సంఘం మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కాట మాధవి, ప్రధాన కార్యదర్శిగా షబానా, ఉపాధ్యక్షురాలిగా రడపాక యాకలక్ష్మి, సహాయ కార్యదర్శిగా గుండెబోయిన రోజ, చొప్పరి వెంకటమ్మ, రచ్చ శకుంతల, తాటికాయల రేణ, ఇల్లందుల భారతలక్ష్మి, కత్తుల ఆల్వమ, గంగరబోయిన లక్ష్మి, ముత్యాల కోమల, తదితరులు పాల్గొన్నారు.