Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై నిరంతర పోరాటం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చెప్పారు. డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకుడు బెల్లయ్య నాయక్‌తో కలిసి దయాకర్ పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. దళితులతో విందు భోజనాలు పెద్ద డ్రామా అని చెప్పారు. దళితులను భ్రమల్లోకి నెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దళితులకు భూములు, ఆత్మగౌరవ భవనాలు ఇవ్వకుండా చిన్నచూపు చూసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ ఒలకబోస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ది వంచించే చరిత్ర అని చెప్పారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు దళితబంధు నెరవేర్చకపోతే కేసీఆర్‌ను గద్దె దింపుతామని చెప్పారు. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పని చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ 2023 నాటికి రూ.6 లక్షల కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.1.50 లక్షల అప్పు ఉంటుందన్నారు. తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. యువత మేల్కొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సదాకర్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ధీకొండ శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సుంచు సంతోష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవినాయక్, యూత్ మండల అధ్యక్షుడు తండా రవి యాదవ్, రాహుల్ సేన మండల అధ్యక్షుడు రాయిపల్లి రాజు, మండల నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ధీకొండ మధుగౌడ్, వడ్లకొండ రాజ్‌కుమార్, తండాల శ్రీకాంత్, యాకన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద యాకమల్లు తదితరులు పాల్గొన్నారు.