Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో రెండ్రోజులు వర్షాలు..
అప్రమత్తమైన అధికారులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్నగరం తడిసి ముద్దయ్యింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ నగరంలోని ఎస్ఆర్నగర్, గరీబ్‌నగర్, ఎన్టీఆర్ నగర్లో ఇండ్లల్లోకి వరద చేరింది. దీంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో రెండ్రోజులపాటు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరంగల్, హన్మకొండలోని లోతట్టు ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, డిఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు సన్నద్ధం చేశారు. హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్ కలెక్టర్ ఎం. హరిత అధికారులతో సమావేశం నిర్వహించి వరద నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షాలు కురియడంతో నగరం మరోమారు వరద ముంపుకు గురైంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం వణకడం ఇది కొత్త కాకపోయినా, వరద ముంపును ఎదుర్కొనడానికి గత ఏడాది వరద ముంపు పరిశీలనకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా, అవి నేటికీ పూర్తి కాలేదు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా గ్రేటర్ వరంగల్ నగరానికి వరద పోటు తప్పడం లేదు. ఆది, సోమవారాలు కురిసిన భారీ వర్షాలకు నగరంలోని భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. వరంగల్, హన్మకొండ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది.
హన్మకొండ జిల్లాలో 3.3 సెంటిమీటర్ల వర్షపాతం
హన్మకొండ జిల్లాలో సగటున 3.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో భీమదేవరపల్లిలో 1.8 సెంటిమీటర్లు, వేలేరులో 1.1, ఎల్కతుర్తిలో 2.1, కమలాపూర్‌లో 1.9, హసన్‌పర్తిలో 8.5, ధర్మసాగర్లో 1.8, కాజీపేటలో 4.0, హన్మకొండలో 4.7, ఐనవోలులో 4.8, శాయంపేటలో 1.9, దామెరలో 5.9, ఆత్మకూరులో 1.5, నడికూడలో 5.0, పరకాలలో 0.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వరంగల్ జిల్లాలో 3.3 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లాలో సగటున 3.3 సెంటిమీటర్ల వర్షపాతం
వరంగల్ జిల్లాలో సగటున 3.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్‌లో 5 సెంటిమీటర్లు, గీసుగొండలో 5, సంగెంలో 5.5, వర్ధన్నపేటలో 1.6, రాయపర్తిలో 1.5, పర్వతగిరిలో 4.8, నర్సంపేటలో 1.7, చెన్నారావుపేటలో 4.2, నెక్కొండలో 8.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా దుగ్గొండిలో 1.4 మిల్లీమీటర్లు, నల్లబెల్లిలో 6.6, ఖానాపూర్‌లో 7.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయ్యింది.
వరద నివారణ పనులు పూర్తి కాక..
గత ఏడాది ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు నగరం వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతంలోని కాలనీలే కాకుండా నగరం వరదమయంగా మారింది. ఈ నేపథ్యంలో నాడు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్‌ను సందర్శించి నాలాల దురాక్రమణలకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నెల రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నేటికీ మంత్రి ఆదేశించిన ఆక్రమణలు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం తొలగించలేకపోయింది. ఇదిలావుంటే వరద నివారణకు నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరుగలేదు. దీంతో తాజా భారీ వర్షాలకు మరోమారు వరంగల్ నగరం వరద ముంపుకు గురికాక తప్పలేదు.
అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు
గత ఏడాది ఆగస్టులో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో చేయాల్సిన పలు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిధుల లేమితో నిలిచిపోయాయా ? ఇతర కారణాలేమిటీ ? అనే విషయంలో అధికారులు స్పష్టతనివ్వరు. హన్మకొండలో సమ్మయ్యనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. నయీంనగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులు నేటికీ ప్రారంభించలేదు. సేయింట్ పీటర్స్ కాలేజీ సమీపంలోని నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించలేదు. బొందివాగు, భద్రకాళి నాలాలలో ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించలేదు. వరంగల్ ప్రాంతంలోని ఎస్ఆర్నగర్, ఎన్టీఆర్ నగర్, గరీబ్‌నగర్ ప్రాంతాల్లో నాలాల విస్తరణ చేయాల్సి వుంది. ఈ పనులు చేయకపోవడం వల్ల భారీ వర్షాలు కురిస్తే వరద పోటెత్తి ఇండ్లలోకి చేరడంతో నిత్యావసర వస్తువులు మునిగి తినడానికి తిండి లేని దుస్థితి నెలకొంది. ఎస్ఆర్నగర్, గరీబ్నగర్లలో పరిస్థితి దారుణంగా వుంది. ఇప్పటికైనా గత ఏడాది మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన పనులను పూర్తి చేయడమే కాకుండా వరద పోటెత్తినట్లు ఇబ్బందులు వస్తున్న ప్రాంతాల్లో నాలాల విస్తరణకు తక్షణమే పనులు ప్రారంభించాలని నగరవాసులు కోరుతున్నారు.