Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిలిచిపోయిన భూసేకరణ
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు లేకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రాజెక్టు రెండో, మూడో దశల్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పనులు సైతం పూర్తి కాలేదు. 2001లో శంకుస్థాపన చేయగా పనులు 2003లో మొదలయ్యాయి. ఇప్పటివరకు 17 ఏండ్లు గడిచినా 50 శాతం ఆయకట్టుకు కూడా సాగునీరందించని దుస్థితి నెలకొంది. మొదటి దశలో 45, 46 ప్యాకేజీల్లో నేటికీ పలు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో దశ పనులను 2007లో దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేటికీ పూర్తి చేయలేకపోవడానికి నిధుల లేమి అసలు కారణం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించినా అవి ప్రజలను నమ్మించడానికే తప్ప పనులు చేయడానికి కాదనేది నగ సత్యం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో 3 వేల 466 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.171.43 కోట్లు కావాలని ప్రాజెక్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు లేకపోవడంతో పనులు జరగడం లేదు. దేవాదుల మొదటి దశలో 4, రెండో దశలో వెయ్యి 5, మూడో దశలో 2 వేల 305, నాన్ ఈపీసీ పనుల కోసం 153 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో భూసేకరణలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రాజెక్టుతో 60 టీఎంసీల గోదావరి జలాలతో 9 జిల్లాలకు చెందిన 6.53 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యం సుదూరంలో నిలిచిపోయింది. 2001లో చేపట్టిన ఈ ప్రాజెక్టు గడచిన 20 ఏండ్లలో రూ.12 వేల 727 కోట్లు వెచ్చించినా, ఇప్పటివరకు 2 లక్షల 34 వేల 71 ఎకరాలకు మాత్రమే సాగునీరందించగలుగుతున్న పరిస్థితి నెలకొంది. మరో 3.24 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం 2001లో చేపట్టిన పనులు 2003 నుంచి ప్రారంభమయ్యాయి. మూడు దశల్లో 6.52 లక్షల ఎకరాలకుగాను 20 ఏండ్లు గడిచినా కేవలం 2.34 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందించారు. మరో 3.24 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్‌టేక్‌వెల్ నుంచి 60 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన 5.58 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. చెరువులను నింపడం ద్వారా 6.52 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తున్నా, ఇందులో చిన్న నీటి పారుదల శాఖకు చెందిన చెరువులు నింపడం ద్వారానే సాగు అవుతోంది. భూసేకరణలో ప్రతిష్టంభన నెలకొనడంతో డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ క్రమంలో గత దశాబ్ధకాలంలో దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో చెరువులను నింపడానికి ప్రాముఖ్యతనిచ్చారు.
చెరువులతోనే పారకం..
దేవాదుల ప్రాజెక్టు కింద వెయ్యి 264 చెరువులున్నాయి. దీని కింద 94 వేల ఎకరాల ఆయకట్టుంది. 2014 నుంచి ఇప్పటివరకు ఏటా చెరువులను నింపడం ద్వారానే సాగు జరుగుతోంది. ప్రాజెక్టు కింద ఇప్పటికీ భూసేకరణ జరుగకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ కాల్వల ద్వారా పారకం జరగలేదు. 2014-15లో 43 చెరువులను గోదావరి జలాలతో నింపడం ప్రారంభమై 2021 వానాకాలంలో 528 చెరువులను నింపారు. 2018-19 నుంచి ఏటా వానాకాలం, యాసంగి పంటలకు సాగు నీరందించడానికి చెరువులను నింపుతూ వచ్చారు.
మొదటి దశకే మోక్షం లేదు..
దేవాదుల ప్రాజెక్టు మొదటి దశలో లక్షా 22 వేల 700 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఈ దశలో 45, 46 ప్యాకేజీల ద్వారా డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణం జరిగింది. 2007లో ప్రారంభమైన ఈ రెండు ప్యాకేజీల పనులు 14 ఏండ్లు గడచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. 45వ ప్యాకేజీ పనులు 2007లోనే ప్రారంభమైనా ఇప్పటివరకు 95 శాతం పూర్తయ్యాయి. మరో 5 శాతం ఇంకా పూర్తి కాలేదు. 46వ ప్యాకేజీ పనులు 91 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మరో 9 శాతం పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.
రెండో దశలోనూ అంతే..
దేవాదుల ప్రాజెక్టు రెండో దశలో 7.25 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా లక్షా 93 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా దీని పరిధిలోనూ డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. రెండో దశలో 14 వేల 680 ఎకరాలకు గాను 13 వేల 675 ఎకరాలు మాత్రమే సేకరించారు. మరో వెయ్యి ఐదెకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో డిస్ట్రిబ్యూషన్ పనులు ముందుకు సాగడం లేదు. ఆర్ఎస్ ఘన్పూర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పనులు 2007లో ప్రారంభించగా, 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ 14 ఏండ్ల కాలంలో 97.4 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఆర్ఎస్ ఘన్పూర్ కుడి కాల్వ పనులు 2011లో ప్రారంభం కాగా 24 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా 11 ఏండ్లు గడిచినా 86 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కు సంబంధించిన పనులు 2007లో ప్రారంభమయ్యాయి. 18 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా 14 ఏండ్లు కావచ్చినా 61.70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. తపాస్‌పల్లి డిస్ట్రిబ్యూషన్ పనులు 2007లో ప్రారంభించారు. 14 ఏండ్లు గడిచినా 87.10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
మూడో దశలో తీవ్ర ప్రతిష్టంభన
ప్రాజెక్టు మూడో దశలో భూసేకరణ అడ్డంకితో 8 ప్యాకేజీ పనుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్యాకేజీ-1 పనులు తప్ప మిగితా 7 ప్యాకేజీల పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీలన్నీ 2008-10 మధ్యే ప్రారంభమయ్యాయి. 36 నుంచి 58 నెలల గడువు లోపు చేయాల్సి ఉండగా ఇంకా పూర్తి కాలేదు. మూడో దశలో 12 వేల 489 ఎకరాలకుగాను 10 వేల 185 ఎకరాలు సేకరించారు. మరో 2 వేల 305 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణ పూర్తి కాకపోవడంతో ప్యాకేజీల పనులు నిలిచిపోయాయి.