Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ములుగు, మహబూబాబాద్ జిల్లాల సరి హద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరి స్తున్నట్లు గుర్తించడంలో ఏజెన్సీ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. రెండ్రోజుల క్రితం ములుగు మండలం జగ్గన్నగూడెం, అంకన్నగూడెం పరిసర ప్రాంతాల్లో రెండు ఆవులను పులి చంపి తినేసింది. ఈ విషయాన్ని పశువుల కాపరులు గుర్తించి వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ములుగు అటవీ శాఖాధికారులు పశువుల కాపరి చూపిన ప్రాంతాన్ని పరిశీలించి పులి సంచారాన్ని నిర్ధారించి అది కొత్తగూడ అడవు ల్లోకి వెళ్లినట్లు తేల్చారు. దీంతో నర్సంపేట, కొత్తగూడ అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. చివరకు కొత్తగూడ ప్రాంతంలోని ముసలిమడుగు ప్రాంతంలో పులి సంచరించి నట్లు పాదముద్రలు లభించాయి. పులి సంచా రాన్ని అటవీ శాఖాధికారులు నిర్ధారించారు. 14 సెంటిమీటర్ల మేరకు పాదముద్రలుండడంతో ఏజెన్సీవాసులను, పశువుల కాపరులను పులి సంచరిస్తుందని అప్రమత్తం చేశారు. ఓటాయి గ్రామంలో 8 మంది గల బృందాన్ని నియ మించారు. ముసలిమడుగులో 8 కెమెరా ట్రాప్ లను అమర్చి పులి సంచారాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నారు.
ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఆనవాళ్లు లభించడంతో ఏజెన్సీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు మండలం జగ్గన్నగూడెం నుండి కొత్తగూడ అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్లు ఏజెన్సీవాసులు చెబుతున్నారు. దట్టమైన అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం 6.00 గంటల వరకే ఇళ్లు చేరుకోవాలని సూచించారు. ఈ విషయం తెలియగానే ములుగు, నర్సంపేట అటవీ శాఖాధికారులు సరిహద్దు ప్రాంతాల్లో సంచరించి పెద్దపులి పాదముద్రలను కనుగొన్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులు ధృవీకరించారు. కొత్తగూడ, గంగారం మండలాల అడవుల్లోకి ఎవరూ వెళ్లొద్దని తెలిపారు. పులి కనిపిస్తే హాని తలపెట్టొద్దని అధికారులు సూచించారు. పెద్దపులి రాకతో అడవికి రక్షణగా అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. ములుగు జిల్లా జగ్గన్నగూడెం నుండి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు గుర్తించిన పాదముద్రలు పెద్ద పులివేనని అటవీ శాఖాధికారులు నిర్ధారించారు. ఆ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని చెబుతున్నారు. రెండు పశువులను పెద్ద పులి తినడంతోపాటుగా రెండు గేదెలను గాయపరచడంతో విషయం బహిర్గతమైంది. ఈ మేరకు అటవీ శాఖ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఓటాయి అడవుల్లోకి కాలినడక మార్గం ద్వారా చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో వున్న పాదముద్రలను పరిశీలించారు. అక్కడ వున్న పాదముద్రలు 14 సెంటిమీటర్లు వుండడంతో అవి పెద్దపులి పాదముద్రలేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు
ములుగు మండలం జగ్గన్నగూడెం, అంకన్నగూడెం ప్రాంతాల్లో రెండు ఆవులు చంపడంతో గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖాధికారులు జగ్గన్నగూడెం, అంకన్నగూడెం అటవీప్రాంతంలో పాదముద్ర లను గుర్తించి పులి నర్సంపేట అటవీ ప్రాంతంలోని కొత్తగూడ అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజహత్ నేతృత్వంలో 12 మంది బృందం సోమవారం కొత్తగూడ అటవీ ప్రాంతంలోని ఓటాయి గ్రామానికి చేరుకొని గ్రామస్తుడు రమేష్‌ను తీసుకొని పరిసర ప్రాంతాల్లో సంచరించారు. రమేష్ చూపించిన పాదముద్రలను ఫోటోలు తీసి వాటి పరిమాణాన్ని కొలిచి నివేదిక పంపారు. ముసలిమడుగు ప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. దీంతో అక్కడ సోమవారం 2 కెమెరాలను, మంగళవారం మరో 4 కెమెరాలను అమర్చారు. పులి సంచారాన్ని కెమెరా ట్రాప్‌ల ద్వారా నిర్ధారించడానికి అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటాయిలో ఎనిమల్ ట్రాకర్లు 4గురు, బేస్ క్యాంప్ బృందం 4గురు మొత్తం 8 మంది గ్రామంలోనే బస చేస్తున్నారు. ఓటాయి గ్రామం నుండి 10 కిలోమీటర్లు ప్రయాణించి ముసలిమడుగుకు చేరుకోవాల్సి వుంటుంది. ఇందులో కొంత మేరకు బైక్‌లపై వెళ్లినా, మరింత ముందుకు పోవడానికి కాలి నడకే శరణ్యం. 10-12 మంది బృందంగా పులి సంచరించే ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశముంది. దీంతో అటవీ శాఖాధికారులు పరిసర ఏజెన్సీ వాసులను అప్రమత్తం చేశారు. ప్రజలను, పశువుల కాపరులను అప్రమత్తం చేశారు.