Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలి.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ- సుబేదారి
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, కార్పొరేషన్ డివిజన్లలో నేడు, మండల, జిల్లా కేంద్రాల్లో 6న నిర్వహించే కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను బరితెగించి అమలు చేస్తోందని విమర్శించారు. నూతన చట్టాలతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థను, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని బలహీనపరుస్తూ ప్రమాదకరమైన 3 చట్టాలను ముందుకు తెచ్చిందని దుయ్యబట్టారు. 4 లేబర్ కోట్లు తెచ్చి కార్మికవర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు పేదలకు పౌష్టికాహారం అందించడంలో విఫలమైనందునే పేదరికం అనూహ్యంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై నిర్భంధాన్ని ప్రయోగిస్తున్న బీజేపీ విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనకు ముప్పని తెలిపారు.
కరోనా మహమ్మారితో కోట్లాది మంది వైరస్ బారిన పడి లక్షలమంది చనిపోయారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి దోహదం చేసే వ్యాక్సినేషన్ నేటికీ దేశంలో 2 డోసులు 10 శాతం మందికి, 1 డోసు కేవలం 34 శాతం మందికి మాత్రమే అందించారని ఎద్దేవా చేశారు. దీని కోసం రు.35వేల కోట్లు కేటాయించడానికి మోడీ సర్కారుకు చేతులు రావడంలేదన్నారు. ఎక్సైజ్ పన్నులను గణనీయంగా పెంచడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెరిగాయన్నారు. దేశీయ కార్పొరేట్ సంస్థలకు ఉద్దీపన పధకాల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, ప్రజాతంత్రవాదుల హక్కులపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.. ప్రజల ఐక్యతకు బీజేపీ, ఆరెస్సెస్ సంఫ్‌ు పరివార్ శక్తులు విఘాతం కల్గిస్తూ భావోద్వేగాలతో ప్రజా సమస్యలను మరుగున పరుస్తున్నాయని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను మోడీ సర్కార్ తీవ్రంగా బలహీనపరిచిందన్నారు. బీమారంగ ప్రైవేటీకరణ, రైల్వే విమానయానం, రవాణా, ఎయిర్ పోర్టులు, ఖనిజసంపద, విశాఖ స్టీలు,సింగరేణి బొగ్గుబావుల వేలం తదితర నిర్ణయాలతో ప్రభుత్వరంగం నిర్వీర్యమవుతోందని మండిపడ్డారు. ఏడేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదలకు జీఓ 58 ప్రకారం పట్టాలు ఇస్తామని ప్రకటించి నేటికి ఇవ్వలేదన్నారు. హన్మకొండలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చస్తోందన్నారు. నిరుద్యోగ భతి వాగ్దానం వాగ్దానంగానే మిగిలిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జీఎస్టీలో రావలసిన వాటా కోసం ఒత్తిడి చేయడం లేదని మండిపడ్డారు. విభజన హామీ చట్టంలో పేర్కొన్నట్లు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హెరీడా తదితర హామీలను సాధించుకోవడానికి రాజకీయ పారీలు ఐక్యంగా కదిలి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ ప్రభాకర్ రెడ్డి, టీ ఉప్పలయ్య, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, జీ రాములు, డీ తిరుపతి, జిల్లా నాయకులు కాడబోయిన లింగయ్య, డీ భాసునాయక్, బాషబోయిన సంతోష్, మండ సంపత్, ఈసంపెల్లి అశోక్, వేల్పుల రవి, మండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..