Authorization
Mon Jan 19, 2015 06:51 pm
9న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి
నవతెలంగాణ-నడికూడ
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల రమేష్ పిలుపునిచ్చారు. కౌకొండ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆయన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఒక్క పీఆర్సీ అమలు ఉపాధ్యాయులకు సర్వరోగ నివారిణిగా చూపెడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నో ఏళ్ళుగా అంతర్ జిల్లా బదిలీలు లేక భార్యాభర్తలు వేరు, వేరు జిల్లాలో పనిచేస్తు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా పోయిందన్నారు. గత మూడేళ్లుగా సాధారణ బదిలీలు లేవని, అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి గత ఏడేళ్ళుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించక మొండి చేయి చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తాననడం ప్రభుత్వ దివాళకోరు తనానికి నిదర్శనమన్నారు. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వాలు బకాయిలు చెల్లిస్తాయో, లేదో ఎవరికి తెలుసునని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల పరిశుభ్రత కోసం సర్వీస్ పర్సన్స్ ను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్ భధ్రతలేని సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేస్తుందన్నారు. సామాన్య ప్రజలకు విద్య అందకుండా చేసి పాఠశాలలను మూసివేసే హేతుబద్ధీకరణ ఉత్తర్వులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఆకారణంగా నిలిపివేసిన ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే కొనసాగించాలని, తదితర డిమాండ్లతో చేపట్టిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మొండి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, కుమార స్వామి, ప్రభాకర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.