Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కాంప్లెక్స్ వేలంలో జరిగిన అక్రమాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్‌కు హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న 'కుడా' కాంప్లెక్స్ దక్కేలా చేయడానికి చైర్మెన్, అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు న్నాయి. కుడా కార్యాలయంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికారులు కార్యాలయంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినా వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్‌రెడ్డిపై తాజాగా ఏసీబీకి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్కా జడ్సన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుడా కాంప్లెక్స్‌కు వేలం నిర్వహించిన విధానం, అందులో కేవలం ముగ్గురే పాల్గొనడం అనుమానాలకు బలాన్నిస్తోంది. కుడా చైర్మెన్, పీఓ సదరు అధికార పార్టీ కార్పొరేటర్‌తో కుమ్మక్కై ఆ కమర్షియల్ కాంప్లెక్స్‌ను దక్కేలా చేశారన్న విమర్శలున్నాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఉన్నాడని ప్రచారం సాగుతోంది. కుడా లే అవుట్లలోనూ అక్రమాలు జరుగుతుండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పలు గ్రామాల్లో ల్యాండ్ పూల్‌కు రహస్యంగా సర్వే నిర్వహించడం, రైతులు వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం గమనార్హం. ఈ క్రమంలో కుడాలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు చెందిన హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు వేలం నిర్వహించడం, ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే పాల్గొనడం, ఈ కాంప్లెక్స్‌ను అధికార పార్టీ కార్పొరేటర్ దక్కించుకోవడం విమర్శలకు తావిచ్చింది. దశాబ్ధాలుగా ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌ను ఖాళీగానే పెట్టిన కుడా అధికారులు తాజాగా వేలం నిర్వహించడం, అది కాస్తా విమర్శల పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. కుడా కాంప్లెక్స్‌ను అధికార పార్టీ కార్పొరేటర్‌కు దక్కేలా చేయడానికే పక్కా స్కెచ్ ప్రకారం చైర్మెన్, పీఓ వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. దశాబ్ధాలుగా కుడాలోనే పాతుకుపోయిన అధికారి వ్యవహారశైలిపై కొన్నేండ్లుగా ఫిర్యాదులున్నాయి. గతంలో ఒకసారి ఏసీబీ దాడిలో దొరికడం, కేసు నమోదు కావడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పీఓపై మళ్లీ విమర్శలు రావడం చర్చకు దారితీసింది.
చైర్మెన్, పీఓల అవినీతి..?
కుడా కమర్షియల్ కాంప్లెక్స్‌ను అధికార పార్టీ కార్పొరేటర్‌కు దక్కేలా చేయడానికి తెర వెనుక పెద్ద తతంగం నడిచిందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన కీలక ప్రజాప్రతినిధి హస్తమున్నట్లు సమాచారం. కమర్షియల్ కాంప్లెక్స్ కోసం నిర్వహించిన వేలంలో కేవలం ముగ్గురే పాల్గొన డంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కుడా లే అవుట్ల లో చోటు చేసుకుంటున్న అక్రమాలు కుడా చైర్మెన్, పీఓ నేతృత్వంలోనే జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి.
చైర్మెన్, పీఓలపై ఏసీబీకి ఫిర్యాదు
కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్రెడ్డిల అవినీతిపై టీపీసీసీ అధికార ప్రతినిధి బక్కా జడ్సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల విలువైన కుడా కాంప్లెక్స్‌ను అధికార పార్టీ కార్పొరేటర్‌తో కుమ్మక్కై చైర్మెన్, పీఓ అవినీతికి పాల్పడి నియమ, నిబంధనలకు భిన్నంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏసీబీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ అక్రమ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కుడా ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. కుడా అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలున్నాయి. ఖిలా వరంగల్‌లో కుడా లే అవుట్‌తో ప్లాటింగ్ చేసిన ఓ వెంచర్లో పలువురి ఫిర్యాదుల మేరకు తహసీల్దార్ ఆ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయాన్ని కుడా అధికారుల దృష్టికి ఆ వెంచర్ నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీసుకువెళ్లినా సమస్యను పరిష్కరించకపోవడం గమనార్హం.
లే అవుట్ వెంచర్లలోని పార్కింగ్ స్థలాల విక్రమాలు
కుడా పాలకవర్గం, అధికారులు వెంచర్ నిర్వాహకు లతో కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడి జరుగుతున్న అక్రమాల విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. లే అవుట్ వెంచర్లలో పార్కింగ్‌కు చూపిన స్థలాలను సైతం వెంచర్ నిర్వాహకులు విక్రయించినా కుడా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుడా దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ల్యాండ్ పూలింగ్‌పై నిరసనలు
కుడా అధికారులు ల్యాండ్ పూలింగ్ కోసం ఆరెపల్లి, తదితర 5 గ్రామాల్లో రహస్య సర్వే నిర్వహించడం వివాదానికి తావిచ్చింది. ఆరెపల్లి జాతీయ రహదారి వద్ద అధికారుల రహస్య సర్వేపై రైతులు పెద్దఎత్తున వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ యోగ్యమైన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. కుడా అధికారుల రహస్య సర్వేపై భగ్గుమన్న రైతులు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రి, కలెక్టర్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
అక్రమాలపై ఇంటెలిజెన్స్ ఆరా..
కుడా చైర్మెన్, పీఓలపై వస్తున్న విమర్శలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కుడా కమర్షియల్ కాంప్లెక్స్ వేలానికి అవలంభించిన మార్గదర్శక సూత్రాలు, ఆచరణలో చేసిన పద్దతులపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్ సదరు కమర్షియల్ కాంప్లెక్స్‌ను అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా దక్కించుకోవడం, తెర వెనుక భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి.
కుడాపై చర్యలు తీసుకునేనా..?
రాష్ట్ర ప్రభుత్వం కుడాపై వస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో చైర్మెన్, పీఓలపై చర్యలు తీసుకునే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్రెడ్డిలపై చర్యలు తీసుకుంటారని గులాబీ పార్టీ వర్గాల్లోనే చర్చ జరగడం గమనార్హం. కుడా చైర్మెన్‌గా మర్రి యాదవరెడ్డికి రెండోసారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవకాశమిచ్చారు. తాజాగా కుడాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుడా ప్రక్షాళనకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం.