Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఎఫ్టీయూ జాతీయ
అధ్యక్షుడు సాధినేని
నవతెలంగాణ-బయ్యారం
కార్మిక వ్యతిరేక విధానాల అమలులో కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్‌లను ఒకే తానుముక్కలుగా ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వర్రావు అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల శ్రమను దోచుకునే కార్పొరేట్ సంస్థలకు కాపలాదార్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయాయని ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టీయూ అనుబంధ తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాంసింగ్ అధ్యక్షతన రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహింగా ముఖ్యఅతిథిగా సాధినేని పాల్గొని ప్రసంగించారు. కరోనా కాలంలో దేశంలోని అన్ని తరగతుల ప్రజలు పనుల్లేక ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడ్డారని చెప్పారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, మోడీ అనుచరులు మాత్రమే లబ్ధి పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో 4 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఆదివాసీలను అడవుల నుంచి తరిమే కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న సింగరేణి, ఆర్టీసీ, రైల్వే, ఇన్సూరెన్స్, విశాఖ స్టీల్ ప్లాంట్, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కష్ణ, ఉపాధ్యక్షుడు సీతారామయ్య, కోశాధికారి రాసుద్దీన్, యూనియన్ ప్రధాన కార్యదర్శి మదార్, కార్యదర్శి ఏపూరి వీరభద్రం ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు దుర్గాప్రసాద్, శ్రీరాములు, సనప రాంబాబు, రవి, శంకర్, స్వరూప, రాజమ్మ, అదినారాయణ, జలంధర్, రాధమ్మ, సురేష్, పద్మ, బుచ్చమ్మ, తిరుపతమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.