Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీసు కమిషనర్ డా||తరుణ్ జోషి
నవతెలంగాణ- సుబేదారి
నేరాలకు పాల్పడిన నిందితులకు కోర్టులో కఠిన శిక్షలు పడే విధంగా వాదనలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా||తరుణ్ జోషి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించారు. ఆదివారం స్థానిక కమిషనరేట్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నేరస్తుల నేరాలను కోర్టు నిరూపించి వారికి కఠిన శిక్షణ పడేందుకుగాను పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడటంతో భాధితులకు న్యాయం జరగడంతో పాటుగా వారికీ పోలీసులు, కోర్టులపై నమ్మకం, గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
బాధితులకు, బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంలో పనిచేయాలన్నారు. 2019 నుంచి 2021 సంవత్సరంలో అత్యధిక కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం అభినందించదగ్గ విషయమన్నారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకుగాను కోర్టులో సమర్పించాల్సిన సాక్ష్యాధారాలపై పోలీసు అధికారులకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరక్టర్, మొదటి అదనపు జిల్లా న్యాయస్థాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారయణ అవగాహన కల్పించారు.
అనంతరం కమిషనరేట్ పరిధిలో నిందితులకు కఠిన శిక్షలు పడటంలో వాదనలు వినిపించిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డా. అజరు కుమార్, మొదటి అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణ, నాలుగో అదనపు జిల్లా కోర్టు పీపీ చెరుకు సత్యనారయణ, రెండో అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు పీపీ అబ్దుల్ నబి, కరీంనగర్ జిల్లా మూడో అదనపు జిల్లా కోర్టు పీపీ సంజీవరెడ్డిని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శాలువాలు కప్పి సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమములో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఆర్ బీ ఏసీపీ ప్రతాప్ కుమార్, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీసీిఆర్ బీ ఇన్స్పెక్టర్ రామకష్ణ, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్సై వెంకటస్వామి, ఎఎస్సై ప్రతాప్ రెడ్డి, కానిస్టేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.