Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేపటి నుంచి వినతిలు, ఆందోళన పోరాటాలు
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ-నర్సంపేట
గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కంచాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో సీఐటీయు జిల్లా కోకన్వీనర్ కందికట్ల వీరేష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల జిల్లా సమావేశంలో వెంకటయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, గ్రామ పంచాయతీలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు 30శాతం పీఆర్సీని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కేవలం జమ్మికుంట మున్సిపాలిటీలో పీఆర్సీని ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకుండా సరియైందికాదన్నారు. రాష్ట్రంలోని అన్నీ శాఖలకు అమలు చేసినట్లే జీపీ, మున్సిపల్ కార్మికులకు 30శాతం పీఆర్సీని ఇవ్వకుండా ప్రభుత్వం వివక్షత చూపడం అన్యామన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కొనసాగుతూ ప్రజలకు కరోనా నుంచి రక్షించిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే పీఆర్సీ అమలు చేస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, రూ.2లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జీపీలలో మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా రేపటి నుండి చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలలో పాలుపంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేయాలని, ఈనెల 10న డీపీవోలకు అందజేసి13న చలో కలెక్టరేట్, 16 నుండి 20 వరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 4న చలో హైదరాబాద్ చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, మైసి దేవేందర్, కొమురయ్య, కష్ణ, సరిత, గోపి, దూడయ్య,అశోక్ తదితరులు పాల్గొన్నారు.