Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి
నవతెలంగాణ- సుబేదారి
దళిత బంధు సీఎం కేసీఆర్ ఆడుతున్న నాటకమని, దళితులను మోసం చేసే కుట్రని, దళితుల ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు. దళిత-గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో భాగంగా సొమవారం గ్రేటర్ వరంగల్ 53 వ డివిజన్ లష్కర్ సింగారం, నయీం నగర్ కూడలిలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత-గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ దళిత-గిరిజన ఆత్మ గౌరవ దండోరా కో-ఆర్డినేటర్ బి. అయోధ్యరెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంతటా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని గిరిజనుల కుటుంబాలకు కూడా ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లష్కర్ సింగారం, నయీం నగర్ నుంచి హనుమకొండ తహసిల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్కీ వినతి పత్రం అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఏడేండ్లుగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు, ఆఖరికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివాసీల పోడు భూములు లాక్కొని, ఇదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతామన్నారు. అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అమలు చేయకుండా దళితులు, పేదవారికి వైద్యానికి దూరం చేశారన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసివుంటే దళితులు, గిరిజనలుకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు ముఫ్ఫై వేల ఉద్యోగాలు వచ్చేవని. కానీ భర్తీలు చేయకుండా పేదవారిని ఇంకా పేదరికంలోకి నెట్టారని విమర్శించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించి తీసేసిన ఘనత టీఆర్ఎస్దేన్నారు. కారణం లేకుండా క్యాబినెట్ హౌదాలోలో ఉన్న ఒక దళిత మంత్రిని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..గరిష్ట భూపరిమితి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది పేద ప్రజలకు భూమి పంచి వారికి ఆస్తి ఇచ్చి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందన్నారు. కానీ నేడు కేసీఆర్ సర్కార్ హరిత హారం, హరిత వనం, వైకుంఠ ధామాలు, కలెక్టర్ కార్యాలయాలు , పరిశ్రమల పేరు మీద పేదవారికి ఇచ్చిన అసైన్డ్ భూములని నష్టపరిహారం కూడా చెల్లించకుండా లాక్కుంటున్నారని వాపోయారు. పోడు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న అటవీ ప్రాంతాల ఆదివాసీల భూములని కూడా ధైర్జన్యంగా గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో అటవీ భూముల హక్కు చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులకు ఆదివాసీలకు భూమి చెందేలా మూడు లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సర్కార్ ఏడేళ్ళుగా హక్కు పత్రాలు ఇవ్వకుండా వారికి అన్యాయం చేస్తూ ఆఖరికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రైతు బంధుకు వర్తింప చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీి సభ్యుడు బత్తిని శ్రీనివాస్ రావు, కార్పోరేటర్ తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, వరంగల్ పార్లమెంట్ నుండి పోటి చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, టీపీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్, మీసాల ప్రకాష్ పాల్గొన్నారు.