Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
సోమవారం కురిసిన వర్షానికి 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఐలమ్మ నగర్, మధుర నగర్ తదితర కాలనీలు పూర్తిగా నీటమనిగాయి. 19వ డివిజన్ లోని వివేకానంద కాలనీ, పద్మనగర్ కాలనీలో వర్షపునీరు రోడ్డుపై నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మూడవ డివిజన్ పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు పేరుకుపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గరీబ్ నగర్ క్రిస్టియన్ కాలనీ ల నుండి వచ్చే వరద నీరు చిన్న వడ్డేపల్లి చెరువు లోకి మల్లించక పోవడం వల్ల ఆ నీరు ఎస్సార్ నగర్ కు ముంచెత్తింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం డ్రైనేజీ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
నవతెలంగాణ-చిట్యాల
భారీ వర్షాల వల్ల రోడ్లకు ఇరువైపులా నీరు నిలిచి అనారోగ్య పాలవుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన అటకాపురం సరోజన ఇంటిలోకి నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపుల కాలువలు లేకపోవడంతో నీరు నిలిచి దోమలు వాలి దుర్గంధం వెదజల్లుతూ అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
హన్మకొండ బస్టాండ్ జలమయం
నవతెలంగాణ-హన్మకొండ
సోమవారం కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ కొత్త బస్టాండ్ జలమయమైంది. అండర్ డ్రైయినేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో కేడీసీసీ ముందునుండి హనుమకొండ బస్టాండ్ వరకు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ అధికారులు మేయర్ ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నీట మునిగిన గ్రేటర్ కార్యాలయం
నవతెలంగాణ - పోచమ్మమైదాన్
వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో సోమవారం దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇండ్లలోకి నీళ్లు చేరి నగరం జలమయం అయ్యింది. సుమారు నాలుగు గంటలపాటు భారీ వర్షం వల్ల రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. . వరంగల్ బట్టలు బజార్, ములుగు రోడ్, లక్ష్మి గణపతి కాలనీ, మధుర కాలనీ, ఎమ్ హెచ్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్సార్ నగర్, కరీమాబాద్, శివ నగర్, డీజిల్ కాలని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు నిలిచిన దుస్థితి ఏర్పడింది. వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో సైతం నీళ్లు నిలిచిన దుస్థితి ఏర్పడింది.
నవతెలంగాణ-నర్సంపేట
భారీ వర్షంతో రోడ్లు..వీధులు జలమయంగా మారాయి...జాతీయ రహదారి పక్కన డ్రైయినేజీ కాల్వలు నిర్మాణం చేయకపోవడం వల్ల పలువురి ఇండ్లలలోకి వరద నీరు చేరింది..కుమ్మరి కంట కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీటితో జనం తీవ్ర ఇక్కట్ల పాలైయ్యారు. పాకాల రోడ్డు సెంటర్లో భారీగా నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. .మల్లంపెల్లి రోడ్డులో 365 జాతీయ రహదారికి ఇరువైపుల డ్రైయినేజీ కాల్వలను అసంపూర్తిగా నిర్మాణం చేసి కాంట్రాక్టర్ ఒదిలేయడం వల్ల వర్షాలకు వరద నీరు 2వ వార్డులోని పలువురి ఇండ్లల్లోకి నీరు చేరింది.13, 21, 24 వార్డులలోని వీధి రోడ్లన్నీ ఏరులుగా మారాయి. బస్టాండ్ ఏరియాలో ప్రధాన రహదారిలో డ్రైయినేజీ కాల్వల నుంచి సక్రమంగా నీరు వెళ్లడం లేదు. ద్వారకపేట రోడ్డులోని ఇండియన్ బ్యాంకు (ఆంధ్రాబ్యాంక్) ఎదుట కూడా డ్రైయినేజీ కాల్వలు, కల్వర్టులను నిర్మాణం చేయకపోవడం వల్ల తేలికపాటి వర్షానికే వరద నీరు రోడ్డుపై నిలిచి బురుదమయంగా మారుతుంది. మౌళిక సదుపాయాలను కల్పించడానికి ఫ్రభుత్వం టీయుఎఫ్ఐడీ నుంచి కోట్లాది నిధులు మంజూరైనా పట్టణంలో ఆ దిశలో అభివృద్ధి పనులు చేపట్టడంలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో సత్వరమే వేగవంతం చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.వరద ముంపు వాటిల్ల కుండా శాశ్వత ప్రాతిపదకన డ్రైయినేజీ కాల్వలు, కల్వర్టులు, పక్కా రోడ్లను నిర్మాణం చేయాలని కోరుతున్నారు.
కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనం
నవతెలంగాణ-సంగెం
మొండ్రాయి గ్రామంలో ద్విచక్రవాహనం వరద ఉదృతికి కొట్టుకుపోయింది. బైక్ యాజమాని రాజు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈతకొడుతూ ఒడ్డుకు చేరాడు. కొట్టుకుపోతున్న రాజును అతని ద్విచక్ర వాహనాన్ని మామిళ్ళ రమేష్ అనే వ్యక్తి కాపాడడానికి ప్రయత్నం చేసినా మోటార్ సైకిల్ కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదే క్రమంలో కన్నె నరేష్ అనే మరో వ్యక్తి స్కూటీ కూడా కొట్టుక పోయింది. అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. రెండు గ్రామాల మధ్య వరదవల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
నవతెలంగాణ-మహదేవపూర్
ఎడపల్లి గ్రామంలో రోడ్డు పై భారీ వర్షానికి చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. చెట్టును వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.