Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ భూపాలపల్లి
జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, పోడు, పోరంబోకు దేవాదాయ భూములకు, ఇండ్ల స్థలాలకు పట్ట్లాలివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్, జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూములకు పట్టాలివ్వాలని, రైతుబంధు అమలు చేయాలని, ప్రాజెక్టులో, రోడ్ల కింద భూములు కోల్పోయిన వారికి ఉపాధి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు ఇచ్చి రైతుబంధు అమలు చేయాలన్నారు. జిల్లాలో భూమి లేకున్నా అక్రమంగా పట్టాలు చేయించుకొని రైతుబంధు పొందుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. వారి పట్టాలు రద్దు చేసి రైతు బంధు డబ్బులను తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటుగా పోడురైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నా భూములను తిరిగి ఇవ్వాలన్నారు. ఈ భూములపై జాయింట్ సర్వే నిర్వహించాలని తెలిపారు.
సింగరేణి తాడిచర్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురం నుంచి చిట్యాల, టేకుమట్ల మండల లో ఫోర్ లైన్ రోడ్ కింద భూములు కోల్పోయే రైతులకు మార్కెట్ విలువకు మూడు రెట్లు కలిపి నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అన్నారం, మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురైన నష్టపోయిన పంటకు ఎకరానికి 15 లక్షలు ఇవ్వాలని, జిల్లాలో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు అక్రమంగా ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వారిపై కేసు పెట్టాలన్నారు. హమాలి కార్మికులకు తాడు కాట్టు మామూలు ఇవ్వాలని, జిల్లాలో లేబర్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని,. పోస్టుమార్టం సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక చట్టాలను రద్దు చేయొద్దని డిమాండ్ చేశారు. దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, దళితులతో పాటు గిరిజనులు, మైనార్టీ వెనుకబడిన తరగతులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాల పేరుతో దళిత , గిరిజనుల భూములు గుంజు కోవడం అన్యాయమన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకపోతే రాబోయే రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని జేసీ హామీ ఇవ్వటంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పొలం రాజేందర్, వెలిశెట్టి రాజయ్య, కంపెటి రాజయ్య, బొట్ల చక్రపాణి, దేవేందర్, చింతల రజనీకాంత్, సూదుల శంకర్, చంద్రరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.