Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వంద సీట్లతో అధికారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో కష్టపడాలని మళ్లీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ గుబాళించాలని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్జి, తెలంగాణ రాష్ట్ర ఇండిస్టియల్ చైర్మెన్ గ్యాదరీ బాలమల్లు అన్నారు. సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలోని హరిత హౌటల్ లో ములుగు జిల్లా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసిఆర్ ములుగును జిల్లా చేశారని అన్నారు. సీఎంపై నమ్మకంతో ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కవితని గెలిపించారని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ కు ములుగు జిల్లాను ఎంపిక చేశారన్నారు. గోదావరి కరకట్టలకు రూ.137 కోట్లకు మంజూరు ఇచ్చారని, రామప్ప కు మేము కషి చేశామని ఇప్పుడు కొంతమంది డ్రామాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ పట్టుబట్టి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. 2001లో టీఆర్ఎస్ పుట్టి నేటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నదని, ఇంత వ్యవధిలోనే ఢిల్లీలో పార్టీ కార్యాలయం శంకు స్థాపన చేసుకున్నామని అన్నారు. ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ములుగులో ఎలాంటి గ్రూపులు లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కలా ఎందుకు పని చేయలేక పోతున్నామో ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు నేడు కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా తిరుగుతున్నారని అన్నారు. తరతరాలుగా వెనుకబడి ఉన్న దళితులను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం కేసిఆర్ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు దళితబంధు ద్వారా ఇసుతంటే ప్రతిపక్ష నేతలు అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. అంటున్నారు. వారి మాటలు తెలంగాణలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే సీతక్క వల్ల నియోజకవర్గానికి ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. రూ.55 కోట్లతో ఇక్కడకు కలెక్టరేట్ రానుందని, గతంలో ప్రతి పనికి వరంగల్ పోతే ఇక్కడి గిరిజనులకు ఇప్పుడు వారి దగ్గరికే కలెక్టర్ వచ్చిందని అన్నారు. నియోజక వర్గంలోని ఆఖరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోడు భూముల సమస్యను సీఎం కేసిఆర్ స్వయంగా పరిష్కారిస్తామరని చెప్పినట్టు తెలిపారు. పోడు రైతులకు రైతు బీమా ఇస్తున్నామని, త్వరలోనే పట్టాలు కూడా ఇస్తామన్నారు. నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పని చేసి పార్టీ పటిష్టతకు పాటుపడాలని కోరారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయని, రైల్వే స్టేషన్లో టీ అమ్మానన్న ప్రధాని మోడీ నేడు రైల్వేను అమ్మేస్తున్నారని విమర్వించారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలతో పాటు అనుబంధ సంఘాలను ఈ నెల 10 వరకు పటిష్ట పరిచేలా పార్టీ నిర్మాణం చేయడానికి కసరత్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ వైస్ చైర్మెన్ బడె నాగజ్యోతి, ఎంపీపీ వాణిశ్రీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య, డైరెక్టర్ పురుషోత్తం, రమణయ్య, కాకతీయ యూనివర్సిటీ మండలి అధ్యక్షులు గుండాల మదన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ అజ్మీర ప్రహ్లాద్, పలుమండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.