Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరులు
రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది వాగులు, వంకలను, నేలమట్టమైన ఇండ్లను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
జల దిగ్బంధంలో ఆదివాసీ పల్లెలు
తాడ్వాయి : మండలంలోని మేడారం ప్రాంతంలోని ఊరట్టం, ఎలుబాక, పడిగాపూర్, తదితర ఆదివాసి పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జంపన్న వాగు ఉధతంగా పొంగిపొర్లుతోంది. ఎలుబాక చింతల్ క్రాస్ వద్ద ఉన్నలో లెవెల్ బ్రిడ్జి, ఎలుబాక, పడిగాపురం గ్రామాల వెనుక ఉన్న కొంగల మడుగు ప్రవాహానికి ఎలుబాక, పడిగాపురం జలదిగ్బంధమయ్యాయి. ఊరట్టం వద్ద జంపన్న వాగు, తూముల వాగు పొంగిపొర్లడంతో ఊరట్టం జలమయమైంది. రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్న వాగు వెంట ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి సుమారు రెండు వేల ఎకరాలు పంట ముంపునకు గురైంది. వర్షపు నీరు మేడారాన్ని చుట్టేసింది. జంపన్నవాగు వరద నీరు పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపుల్లోకి చేరింది. వరద ఉధతికి మేడారం జంపన్న వాగులోని వరద, వర్షపు నీరు చిలుకల గుట్టను తాకి మేడారంలో భారీగా ప్రవహిస్తోంది.
అధికారుల పరిశీలన
మేడారం జంపన్న వాగు పరిసరాల్లోని మేడారం, ఎలుబాక, పడిగాపూర్, ఊరట్టం గోనేపల్లి గ్రామాలను తహసీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి అప్పయ్య, ఎస్సై వెంకటేశ్వర్రావు, ఆర్ఐ చంద్రమోహన్, వీఆర్వో సమ్మయ్య, సిబ్బంది సందర్శించి పరిశీలించారు. ముంపునకు గురైన పంట పొలాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్, ప్రత్యేక అధికారి భరోసా ఇచ్చారు. జంపన్న వాగు వద్ద గజ ఈతగాళ్లు ఉంచారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
కొత్తగూడ : ఏజెన్సీలో ఆదివారం నుంచి భారీవర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మండలంలోని వేలుబెల్లి వాగు, గాదె వాగు, గుంజేడుతోగు, కత్తెర వాగు, ముస్మి వాగు, మొండ్రాయి గూడెం వాగులు ఉద్ధతంగా ప్రవహిస్తునఆనయి. పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు దాటి పాఠశాలకు వెళ్లలేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది వాగుల వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. విధులకు వెళ్లేందుకు ఆశా కార్యకర్తలు ఇబ్బంది పడుతుండగా ఎస్సై చంద్రమోహన్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను పిలిపించి వారిని పంపించారు.
గూడూరు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రంలోని పాకాల వాగు ఉధతి పెరగడంతో నెక్కొండ, కేసముద్రం, గూడూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరులోని వైకుంఠధామం, నర్సరీ పూర్తిగా నీటమునిగాయి. మండలంలోని కొల్లాపురం గ్రామ పంచాయతీలోని వైకుంఠధామం జలమయమైంది. గూడూరు పాకాల ఉద్రిక్తత జిల్లా అడిషనల్ కలెక్టర్ కొమురయ్య, నీటి పారుదల శాఖ అధికారులు ఎస్ఈ కొండెం వెంకటేశ్వరరావు, ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శైలజ, ఎస్సై సతీష్ వేర్వేరుగా పరిశీలించారు. మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మండలంలో వర్షపాతం 63.4 నమోదైంది.
గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఏటూరునాగారం టౌన్ : ఎగువ ప్రాంతాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల నిండి జలకళతో కళకళలాడుతున్నాయి. జంపన్నవాగులో వరద ఉధతి పెరిగింది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలకు వెళ్లే పలు రహదా రులు వరద ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. మండలంలోని బానాజీ బంధం సమీపాన గల హనుమంతుని వాగు , దయ్యాల వాగు, వట్టి వాగులు వరద ఉధతితో ప్రవహిస్తున్నాయి మండలంలోని చిన్నబోయినపల్లి, షాపెళ్లి మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన బ్రిడ్జి గతేడాది వర్షాకాలం కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధతి ఎక్కువ కావడంతో తాత్కాలికంగా నిర్మించిన రహదారి పూర్తిగా ధ్వంసమవడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
పెరుగుతున్న గోదావరి
ఎగువ రాష్ట్రాలతోపాటు జిల్లాల్లోని వాగుల నుంచి వరద నీరు భారీగా చేరడంతో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువైంది .రెండ్రోజులుగా నిలకడగా ఉన్న గోదావరి మంగళవారం సాయంత్రానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద 6.5 మీటర్లకు చేరుకుంది. అయితే వరద నీరు 8.5 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు.
రాకపోకలు బంద్
స్టేషన్ ఘన్పూర్ : రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు మత్తడి దుంకుతున్నాయి, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. నమిలిగొండ గ్రామంలోని పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొనగా స్థానికులు కాపాడారు. తహసీల్దార్ విశ్వప్రసాద్, సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలోని అండర్ రైల్వే బ్రిడ్జిలోనూ, ఆకెరు వాగుపై నీటి ఎద్దడి పెరగడంతో గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయి. జనం ఇండ్లకే పరిమితమయ్యారు.
చీటకోడూరు వాగు ఉధృతి
జనగామ రూరల్ : దాదాపు 40 ఏండ్ల తర్వాత మండలం చిన్నకోడూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డుపెట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చౌడారం, ఇతర గ్రామాల ప్రజలు వాగు దాటలేని స్థితిలో అక్కడే నిలిచిపోయారు. దశాబ్దాల తర్వాత వాగు భారీగా పొంగడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరిశీలించారు. వాగుపై నిర్మించిన రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. రిజర్వాయర్ గేట్లు కూడా తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు గేట్లు కూడా తెరవడంతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. వడ్లకొండ, పెద్దపహాడ్, గానుగపాడు గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.
గోవిందరావుపేట : రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మండలంలోని వాగులు, వంకలు ప్రమాద ఉధృతి స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. మండలంలోని దయ్యాలవాగు, గుండ్ల వాగు గతంలో ఎన్నడూ లేనివిధంగా పొంగి ప్రవహించాయి. వందలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. మండల కేంద్రంలో అర్ధరాత్రి దయ్యాల వాగు ఉధతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జెడ్పీటీసీ హరిబాబు, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతోపాటు తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ ముంపు ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు వంద మందికిపైగా బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి వంట ఏర్పాటు చేశారు. లక్ష్మీపురం, మొద్దులగూడెం, కల్లెపెల్లి గ్రామాల్లో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన మట్టి గోడలు కూలిపోయి కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. గుండ్ల వాగు దెయ్యాల వాగు పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇండ్లు నేలమట్టం
వాజేడు :మండలంలోని ఇప్పగూడెంలో కారం శంకరయ్య ఇల్లు, జంగాలపల్లిలో తుమ్మిడి నర్సింహారావు ఇల్లు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయాయి. ఆ రెండు కుటుంబాలూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. తహసీల్దార్ రాజ్ కుమార్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని వారిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.