Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వైద్యం, పౌష్టికాహార కల్పన రంగాల్లో సహకరించడానికి ఈసీఐఎల్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లందు క్లబ్‌హౌస్‌లో ఈసీఐఎల్ సంస్థవారు పాఠశాల విద్యార్థులు, చిన్నారులు, బాలింతలతో సమావేశం నిర్వహించారు. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ను, 6ఏండ్లలోపు చిన్నారులకు బాలామృతం, 6-15 ఏండ్లలోపు విద్యార్థులకు పాలు అందించారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ సంస్థ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) ఏ మాల్వియ మాట్లాడుతూ దేశ రక్షణ, ఎన్నికలు, అంత రిక్షం తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించ డమే కాకుండా సామాజిక బాధ్యతగా వైద్యం, పౌష్టికాహార కల్పనకు ఈసీఐఎల్ సంస్థ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆస్పీరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం ద్వారా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రూ.35 లక్షల విలువైన ఆంబులెన్స్ అందిస్తున్నా మన్నారు. రూ.72లక్షల విలువైన పాలను నేషనల్ డైరీ బోర్డు ద్వారా అందిస్తున్నామని తెలిపారు. 6 సంవత్సరాల లోపు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు రూ.10 లక్షల విలువైన పౌష్టికాహారాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఐటీడీఏ ఏటూరునాగారం సహకారంతో అందించనున్నా మని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లా డుతూ నీతి అయోగ్‌తో అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా సేవలందించడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన రంగాల్లో జిల్లా ప్రజలు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, ఇన్చార్జి డీడబ్ల్యూఓ శామ్యూల్, ములుగు డీడబ్ల్యూ ప్రేమలత, డీఈఓలు అబ్దుల్ హై, వాసంతి, సీడీపీఓలు రాధిక, అవంతిక, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ శిరీష, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ మేనేజర్ జయకృష్ణ, ఈసీఐఎల్ ఏజీఎం మురళి కృష్ణ, ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అధికారులు భవానీశంకర్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఏపీఎంలు చిత్తశుద్ధితో పని చేయాలి : కలెక్టర్
స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ఏపీఎంలు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్, డీఆర్డీఏ పీడీ పురుషోత్తం, ఐకేపీ డీపీఎం, ఏపీఎంతో కలిసి రుణాల రికవరీ రేటు సంబంధిత విషయాలపై చర్చించారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగిస్తూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటందించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్ లక్ష్యం రూ.188 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.54కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. లక్ష్యాలను 100శాతం పూర్తి చేయాలన్నారు. రికవరీ రేటు తక్కువ ఉన్నా పలిమెల, కాటారం, మహాదేవపుర్, మల్హర్ రావు మండలాల పై ప్రత్యేక దృష్టి సారించి రికవరీ లక్ష్యాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద, అంబటిపల్లి, పాండవుల గుట్ట వద్ద వినూత్నంగా మహిళా సంఘ సభ్యులతో టూరిస్టులకు కావాల్సిన వస్తువుల అమ్మకం షాపుల యూనిట్లు మంజూరు చేస్తే ఆర్థిక చేయూతనిచ్చినట్టవుతుందన్నారు. కనీసం వెయ్యి కుటుంబాలు బాగుపడేలా డైరీ ఫామ్, హౌటల్, వెజిటేబుల్ యూనిట్లు మంజూరు చేయాలన్నారు. ఎస్టీ మహిళలకు ఐటీడీఏ ద్వారా చిన్నతరహా పరిశ్రమలపై శిక్షణ ఇచ్చేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. ప్రధాన మంత్రి మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా రైతులకు ట్రాక్టర్ పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు, కస్టమర్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నివేదిక తయారు చేయాలన్నారు. డీిఆర్డీఏ పీడీ పురుషోత్తం, అడిషనల్ డీిఆర్డీఓ సురేష్, డీపీఎం రవి, ఏపీఎంలు పాల్గొన్నారు.