Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
నియోజకవర్గమే దేవాలయమని, ప్రజలు తనకు దేవుళ్ళతో సమానమని ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్వికేకే ఫంక్షన్ హాల్లో మంగళవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్‌రెడ్డి అధ్యక్షత న పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల అభిప్రాయసేకరణ ద్వారానే గ్రామ, మండల కమిటీలు ఎన్నుకుంటారన్నారు. గతంలో పని చేసిన కాంగ్రెస్ , టీఆర్ఎస్ కార్యకర్తలను రెండు కళ్లలా చూస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పథ కాలు, అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇక్కడి సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నట్లు తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టాడని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులు స్వాగతిస్తున్నారని, గల్లి నాయకులు మాత్రమే ఉనికి కోసం విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలను కార్యకర్తలే కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మండల స్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి ఉపాధి కోసం తెలంగాణకు కార్మికులు వలసొస్తున్నారని అన్నారు.
సీల్డ్ కవర్ సిస్టం పార్టీలో లేదు : బాలమల్లు
టీిఆర్‌ఎస్ కమిటీల ఎన్నికల్లో సీల్డ్ కవర్ సిస్టం పార్టీలో లేదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇన్చార్జి బాలమల్లు అన్నారు. ఈ నెల 2 నుండి 12 వరకు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను నియమిస్తామ న్నారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేశాక పోటీ ఉంటే సమన్వయపరిచి ఏకగ్రీవ ఎన్నిక జరిపిస్తామని అన్నారు. అనంతరం తొమ్మిది మందికి మంజూరైన రూ.3లక్షల25వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుసుమ శరత్, వైస్ చైర్మెన్ దూదిపాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ కందగట్ల రవి, ఎంపీటీసీ బాసాని చంద్రప్రకాష్, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.