Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యాంక్ బండ్పై ఐలమ్మ,
దొడ్డి కొమురయ్య విగ్రహాలు
ఏర్పాటు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
నిజాం నిరంకుశ పాలనను తలపించేలా రాష్ట్రంలో నయా దోపిడీ పాలన కొనసాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తికి సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నిజాం నిరంకుశ పాలన అంతమైనప్పటికీ అదే ముసుగులో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేశారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ అన్యాయమే జరుగుతున్నదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో బస్సు జాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నయా దోపిడి పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరో పోరాటానికి ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న పాలకుర్తికి బస్ జాత చేరుకుంటుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గని జయప్రదం చేయాలని కోరారు. చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని అన్నారు. పోరాటయోధుల వర్ధంతి, జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మండల కార్యదర్శి ఎండీ యాకుబ్ పాషా, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జగదీష్, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.