Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోలేటిలో ప్రారంభం..
కొత్తగూడెంలో ముగింపు
కార్మిక హక్కులు, సమస్యలే ప్రధాన ఎజెండా
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా సింగరేణి ఏరియాల్లో, పరిశ్రమల్లో కార్మిక పోరు యాత్ర, జీపు జాత నేడు గోలేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు తెలిపారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేడు గోలేటిలో ప్రారంభమై అన్ని ఏరియాల మీదుగా 11 రోజులు పర్యటించి 23న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ముగుస్తుందని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు హాజరవుతారని, పోరుయాత్ర సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి. రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ కంపెనీలు, బొగ్గు బావుల అమ్మకాన్ని నిలిపివేయాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరించి జీవో తేవాలని, జీవో 22ను గెజిట్‌లో ప్రకటించి, పెరిగిన వేతనాలు కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని అన్నారు. కేంద్ర హామీ బయ్యారం స్టీల్ ప్లాంట్ వెంటనే ప్రారంభించాలని అన్నారు. కొత్త బావులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు కార్మికుల మారు పేరు మార్పిడి వెంటనే అమలు చేయాలన్నారు. సింగరేణికి ప్రభుత్వ బకాయి రూ.12వేల కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020 -21 లాభాలు ప్రకటించి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలన్నారు. సీఎం పీఎఫ్ లెక్కలు ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, సింగరేణి కార్మికుల సొంత ఇంటికి 250 గజాల స్థలం కేటాయించాలని కోరారు. ఖాళీగా ఉన్న క్వార్టర్ లను రిటైర్డ్ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని, కార్మికులు కరోనాతో గానీ, ప్రమాదంలో గానీ మరణిస్తే రూ.15 లక్షల ప్రత్యేక ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా విధానాన్ని ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని అన్నారు. తదితర డిమాండ్లతో పోరు యాత్ర సాగుతుందని తెలిపారు. మెరుగైన పదకొండవ వేతన ఒప్పందానికి కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొట్ల చక్రపాణి, కంపె టి రాజయ్య, బందు సాయిలు, కంచ ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.