Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
విద్యుత్ సబ్ స్టేషన్లో శ్రమ దోపిడీ విధానాన్ని అరిక ట్టాలని ఐఎన్టీయూ-327 యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని అమ్మ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చిట్యాల, టేకుమట్ల,మొగుళ్ళపల్లి యూనియన్లకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సబ్ స్టేషన్కు నలుగురు ఆపరేటర్లను విధుల్లో ఉంచాల్సి ఉండగా ఒక్కొక్క సబ్ స్టేషన్లో ఇద్దరిని ఉంచి నెలలో ఒక్క ఆపరేటర్ తో 12 నుండి13 రోజులు పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. జె ఎల్ఎంలకు అక్రమంగా సబ్స్టేషన్ డ్యూటీలు వేస్తూ ఎలాంటి విశ్రాంతి ఇవ్వకుండా ఫీల్డ్ లోకి రావాలని అధికారులు వేధిస్తున్నారని అన్నారు. గతంలో గ్రామాల్లో రెండు నెలలకోసారి రీడింగ్ తీసే విధానం ఉండేదని అన్నారు. సిబ్బందిని పెంచకుండా ఉన్న కార్మికులతో ప్రతి నెలా మీటర్ రీడింగ్ తీయాలంటూ అధికారులు బలవంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సబ్ స్టేషన్లు కడుతూ2014 నుంచి ఆపరేటర్లను నియమించకుండా ఉన్న ఆపరేటర్లపైనే అధిక భారం వేయడం సరికాద న్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు బలరాం, రాజేందర్, బాబు, రాములు, సురేష్, కొమురయ్య, రజాక్, రాజు, శ్రీనివాస్, నవీన్, కిరణ్, కమలాకర్, యుగేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.