Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందితులను శిక్షించాలని ధర్నా
నవతెలంగాణ-నర్సంపేట
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా విమర్శించారు. గిరిజన చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐద్వా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిందుతుడిని శిక్షించాలని వరంగల్ రోడ్డు సెంటర్లో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు, విధ్యార్ధినిలకు రక్షణ కల్పించే పరిస్థితి లేదన్నారు. రోజు, రోజుకు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండడం సమాజాన్ని తీవ్రంగా అభద్రతకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలరై అఘాయిత్యాలు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పునరావృతం అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరోధించడానికి అనేక చట్టాలు ఉన్నా కొందరికి చుట్టాలుగా మారిపోతూ నిందుతులు తప్పించుకుంటాన్నారని వాపోయారు. ఈ ఘటన యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. నిర్భయ చట్టాలను అమలు చేసి నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు ఎండీ.ఫరిదా, గణిపాక ఇందిరా, ఉదయగిరి నాగమణి, వజ్జంతి విజయ, యాకలక్ష్మి, రజిని, ఇప్ప సమత, కొలువుల లావణ్య, బిట్ర స్వప్న, తాళ్లపల్లి ప్రవళ్లిక తదితరులు పాల్గొన్నారు.