Authorization
Sat March 22, 2025 03:57:52 pm
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్
నవతెలంగాణ-హన్మకొండ
ఉపాధ్యాయులకు తక్షణమే ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ దీన్దయాల్నగర్లోని ఆ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హన్మకొండ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులకు బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోన్న క్రమంలో రేషనలైజేషన్ చేపట్టొద్దన్నారు. కోవిడ్ నిబంధనల అమలు కోసం పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, అదనంగా నిధులు కేటాయించాలని, జిల్లా కేంద్రాల్లో లోకల్ ఫండ్, జీపీఎఫ్ కార్యాలయాలను ప్రారంభించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆందోళనలు చేపడతామని చెప్పారు. సమావేశంలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రవీందర్రాజు, ప్రధాన కార్యదర్శి బద్దం వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు సమ్మక్క, జిల్లా కార్యదర్శులు కుమారస్వామి, రవీందర్, తేజావత్ థావూ, నరేష్, సుమిత్ర, అమ్జద్, వేణుమాధవ్, నర్సింహారావు, రమేష్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.