Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మంగపేట మండలంలోని కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు వేతనాలు చెల్లించి, తిరిగి బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ ముట్టడికి చేపట్టిన పాదయాత్రను సోమవారం ములుగు పట్టణం చేరుకోవడంతో పాదయాత్రను పోలీసులు అడ్డుకొని కార్మికులను, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జంగాలపల్లి నుంచి ములుగు వరకు సంఘీభావం మద్దతుగా ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ బలరాం, సీపీఐ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్, వైఎస్ఆర్టిపి రాష్ట్ర కమిటీ సభ్యులు ధరావత్ దేవా నాయక్, బిఎస్పి జిల్లా నాయకులు హాజరై మాట్లాడుతూ కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు శాంతియుత మార్గంలో పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని అన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలను ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. డెబ్బై మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 36 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే బెల్టు ఫ్యాక్టరీ గుర్తుకొస్తుందని, తర్వాత మర్చిపోతారని, బిల్ట్ ఫ్యాక్టరీ మూసివేసిన తర్వాత కార్మికులు హమాలీగా,వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వారి పిల్లలను చదివించే స్థోమత లేదని వారు అన్నారు. ఇప్పటికైనా బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు భూక్య జవహర్లాల్, నాయకులు నగరపు రమేష్, ఇమ్మడి రాకేష్ యాదవ్, జింకల కృష్ణారావు, రవీంద్రచారి, గాదం కుమార్, అనిల్ రెడ్డి, రవిరెడ్డి, రాకేష్‌రెడ్డి తదితరులు సంఘీభావంగా మద్దతుగా పాల్గొన్నారు.